హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోలాహలం

నవరాత్రులు మండపాల్లో కొలువుదీరి విశేష పూజలందుకున్న ఏకదంతుడిని నిమజ్జనం ఆదివారం ఘ‌నంగా నిర్వ‌హించారు. శోభాయాత్రలో వర్షం పడుతున్నా ప్రజలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విఘ్నాధిపతికి నీరాజనాలు పట్టారు. విద్యుత్‌ దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన వాహనాల్లో వివిధ ఆకృతుల్లో కొలువుదీరిన లంబోదరుని విగ్రహాలను ఆదివారం నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌కు తరలించారు.
 
తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ వినాయకుడుతోపాటు నగరంలోని గణనాథులు ఆదివారం హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కానున్నాయి. ఇందుకు గణనాథులు ట్యాంక్ బండ్ కు క్యూ కట్టాయి.
 
 ప్ర‌తి ఏడాది వేలంపాట‌లో ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంటున్న బాలాపూర్ ల‌డ్డూ ఈ ఏడాది కూడా రికార్డు స్థాయి ధ‌రను సొంతం చేసుకుంది. ఈ ఏడాది నాదర్‌గుల్‌కు చెందిన మర్రి శశాంక్‌ రెడ్డి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం పొద్దుటూరుకు చెందిన‌ ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌లు రూ.18.90 లక్షలకు ల‌డ్డూను దక్కించుకున్నారు.
 
ఆదివారం ఉదయం బాలాపూర్‌ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వ‌హించిన అనంత‌రం ఊరేగింపుగా పుర వీధుల గుండా గ్రామ ప్రధాన కూడలి బొడ్రాయి దగ్గరకు తీసుకొచ్చారు. అక్క‌డే వేలం పాట నిర్వ‌హించారు. నగరంలో వినాయక నిమజ్జనం కొనసాగుతుండగా ఆదివారం సాయంత్రం జంటనగరాలైన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. వానలోనూ శోభయాత్ర కొనసాగుతున్నది. ఒక్కసారిగా వర్షం కురువడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి

ఖైరతాబాద్‌ పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు. 40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పుతో కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా కొలువుదీరిన మహాగణపతి శోభయాత్ర ఖైరతాబాద్‌ నుంచి టెలిఫోన్‌ భవన్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌ వరకు సాగింది. 

ఇక్కడ చివరిసారిగా నిర్వాహకులు పంచముఖ రుద్ర మహాగణపతికి పూజలు నిర్వహించారు. అనంతరం నాలుగో నంబర్‌ క్రేన్‌ ద్వారా మహాగణపతిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 8.18 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్‌లో యాత్ర ప్రారంభం కాగా.. సుమారు 6 గంటల పాటు శోభాయాత్ర కొనసాగింది. 

రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావారణంలో జరుగుతోందని  డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 50వేల మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరి సహాయ సహకారాలతో.. పూర్తి స్థాయిలో కొత్త టెక్నాలజీని వినియోగించి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు డీజీపీ వివరించారు.

డప్పుల దరువులు, తీన్‌మార్‌ స్టెప్పులతో గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్‌ మహారాజ్‌కీ జై అంటూ నినాదాలు చేస్తూ సాగిన శోభాయాత్ర ఆద్యంతం ప్రజల హృదయాల్లో భక్తి పారవశ్యం నింపింది. కంటోన్మెంట్‌లోని తిరుమలగిరి, కార్కానా, రసూల్‌పురా, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లిలతో పాటు సికింద్రాబాద్‌ పరిధిలోని బౌద్ధనగర్‌, వారాసిగూడ, పార్శిగుట్ట, మైలార్‌గడ్డ, నామాలగుండు, సీతాఫల్‌మండి, చిలకలగూడ గాంధీచౌక్‌, చిలకలగూడ ,ఔరస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్‌కు శోభాయాత్ర కొనసాగింది.