నిమజ్జనం ఆంక్షలపై సుప్రీం కోర్ట్ కే… కేసీఆర్ జోక్యం కోరిన విహెచ్ పి 

వినాయక నిమజ్జనంపై గతంలో తాము ఇచ్చన ఆదేశాలను మార్చడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ విషయమై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ  పిటిషన్‌ ను కొట్టివేసింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందేనని హైకోర్టు తెలిపింది.  దీంతో ఈ అంశంపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
 
తమ ఆదేశాలపై అభ్యంతరాలుంటే ఉత్తర్వులను సవాల్ చేసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. ఈ ఒక్క ఏడాది మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. గత ఏడాదిలోనూ నిమజ్జనంపై ఉత్తర్వులు ఇచ్చామని  హైకోర్టు సమాధానం ఇచ్చింది. ఏడాది గడిచినా పాటించలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
 
హుస్సేన్‌సాగర్‌తోపాటు చెరువుల్లో పర్యావరణహితమైన విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీవోపీ), సింథటిక్‌, రసాయనాలతో తయారైన విగ్రహాలను బేబీ పాండ్స్‌లో (చిన్న నీటికుంటల్లో) నిమజ్జనం చేయాలని గత గురువారం ఇచ్చిన తీర్పులో హైకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. 
 
దీంతో ఈ తీర్పును సవరించి హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతించాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ సోమవారం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎమ్మెస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ టీ వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 
 
జీహెచ్‌ఎంసీ, ఇతర శాఖల అధికారులు నివేదించిన సమాచారాన్ని పరిశీలించాకే తాము తీర్పు ఇచ్చామని, దీనిపై ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చని తెలిపింది. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మానవాళి మనగడకే ముప్పు ఏర్పడుతుందని ధర్మాసనం పేర్కొంటూ రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది.
 
గతంలో ప్రభుత్వం మూడు కౌంటర్లు దాఖలు చేసిందని హైకోర్టు గుర్తుచేసింది. కానీ ఇప్పటివరకు ఇబ్బందులపై కోర్ట్ దృష్టికి తీసుకురాలేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇబ్బందులు ఈ నెల కంటే ముందే మీ దృష్టికి వచ్చాయని ధర్మాసనం అభిప్రాయ పడింది. అన్ని ఇబ్బందులు ప్రభుత్వానికి తెలుసని, అయినా ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రభుత్వానికి హైకోర్టు చురకలు అంటించింది. 
 
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
 
హైకోర్టులో చుక్కెదురు కావడంతో పీవోపీ, రసాయనాలతో తయారుచేసిన విగ్రహాలను బేబీ పాండ్స్‌లోనే నిమజ్జనం చేయాలని హైకోర్టు స్పష్టం చేయడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. 30 సర్కిళ్ల పరిధిలోని 25 కోనేరుల్లో నిమజ్జనాలు జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం కోనేర్లను పూర్తి స్థాయిలో నీటిని నింపనున్నారు.
భక్తులు కోనేరులో దిగకుండా క్రేన్ల సాయంతో విగ్రహాలను నిమజ్జనం చేసేలా అధికారులు ఫ్లాన్‌ చేస్తున్నారు. నిమజ్జనాల కోసం పోలీస్‌ స్టేషన్ల వారీగా మండపాలకు టోకెన్లు ఇవ్వనున్నారు. నిమజ్జనం ఎప్పుడు, ఎక్కడ చేయాలన్న వివరాలు ఆ టోకెన్లలోనే ఉంటాయని అధికారులు చెప్తున్నారు. క్రేన్ల సాయంతో కోనేరుల్లో దించిన విగ్రహాలను వెంటనే బయటకు తీసి వాహనాల్లో తరలించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. చిన్న విగ్రహాలను ఎక్కడికక్కడే నిమజ్జనం జరిపిస్తామని స్పష్టం చేశారు.
 
కేసీఆర్ జోక్యం చేసుకోవాలి 
 
గణేష్ నిమజ్జనోత్సవంపై ప్రస్తుత గందరగోళ పరిస్థితులకు అధికారుల నిర్లక్ష్యం వైఖరి కారణమని విశ్వహిందూ పరిషద్ విమర్శించింది. గతంలో మూడు సార్లు అవకాశం కల్పించినా ఇప్పుడు చెబుతున్న ఇబ్బందులు అప్పుడెందుకు చెప్పలేదని కోర్టు అధికారులను ప్రశ్నించడం చూస్తుంటే అధికారుల నిర్లక్ష్య ధోరణి స్పష్టమవుతుందని తెలిపింది.
 
 ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే జోక్యం చేసుకొని అవసరమైన న్యాయపరమైన, చట్టపరమైన చర్యలు చేపట్టి నిమజ్జోత్సవాన్ని సాఫిగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని పరిషద్ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణా ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.

మట్టి విగ్రహాల పేరిట వినాయక నిమజ్జనం కారణంగానే కాలుష్యం జరుగుతుందనే విష ప్రచారంలో ప్రభుత్వ విభాగాలు కూడా పాల్పంచుకొని అసలు కారణాలు దాచే కుట్రలకు పాల్పడ్డాయని ఆయన ఆరోపియన్చారు. ఫలితంగా గణేష్ ఉత్సవాల కారణంగానే జల కాలుష్యం జరుగుతుందనే భ్రమ ఏర్పడిందని విమరసంచారు. 
 
అందుకే కాలుష్య కారణాలపై శ్వేత పత్రం విడుదల చేసి కోర్టు ముందు పెట్టాలని మొదటి నుండి డిమాండ్ చేసినా ప్రభుత్వం విస్మరించిందని ఫలితంగా హైకోర్టు నుండి ఉత్సవాలపై ఆంక్షలు విధించే పరిస్థితులు వచ్చాయని మండిపడ్డారు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా వేలాది విగ్రహాలు ప్రతిష్ఠ జరిగి భక్తులచే పూజలందుకుంటున్నాయి, వాటిని నిమజ్జనం చేయడం భక్తుని యొక్క ధార్మిక హక్కు అని పరిషద్ స్పష్టం చేసింది.