వంట నూనెల‌పై దిగుమ‌తి సుంకాల‌ తగ్గింపు

దేశీయ అవ‌స‌రాల నిమిత్తం విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంటున్న వంట నూనెల‌పై దిగుమ‌తి సుంకాల‌ను త‌గ్గిస్తూ కేంద్ర ఆహార మంత్రిత్వ‌శాఖ కార్య‌ద‌ర్శి శ‌నివారం ఆదేశాలు జారీ చేశారు. అంటే విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంటున్న పామాయిల్‌, సోయాబీన్‌, స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఆయిల్ ధ‌ర‌లు తగ్గ‌నున్నాయి. 

అయితే, నెల రోజుల్లోపు దిగుమ‌తి చేసుకుంటున్న వంట నూనెల‌పై సుంకాలు త‌గ్గించ‌డం ఇది రెండో సారి కావ‌డం గ‌మ‌నార్హం. ఖ‌రీఫ్ సీజ‌న్‌లో పంట‌ల దిగుబ‌డి బాగానే ఉంటుంద‌న్న అంచ‌నాల‌తోపాటు అంత‌ర్జాతీయంగా త‌గ్గిన ధ‌ర‌లు దీనికి కార‌ణ‌మ‌ని కేంద్ర ఆహార మంత్రిత్వ‌శాఖ కార్య‌ద‌ర్శి పేర్కొన్నారు.

ఇంత‌కుముందు దిగుమ‌తి సుంకాల త‌గ్గిస్తూ తీసుకున్న నిర్ణ‌యం ఈ నెలాఖ‌రుతో ముగిసిపోనున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే మ‌రోమారు కేంద్రం ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. కేంద్రం నిర్ణ‌యం ప్ర‌కారం అన్ని ర‌కాల ముడి వంట నూనెల దిగుమ‌తిపై క‌స్ట‌మ్స్ సుంకం, అద‌న‌పు ఇన్‌ఫ్రా అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సెస్ 24.75 శాతంగా ఉంటుంది.

రిఫైండ్ ఆయిల్స్‌పై దిగుమ‌తి సుంకం 35.75 శాతం ఉంటుంది. ముడి పామాయిల్‌పై దిగుమ‌తి సుంకం 10% నుంచి 2.5 శాతానికి, ముడి సోయాబీన్‌ ఆయిల్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై ఉన్న 7.5% సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించింది. 60 దేశాల నుంచి కేంద్రం వంట నూనెలు దిగుమ‌తి చేసుకుంటున్న‌ది.

ఇంత‌కుముందు పప్పు ధాన్యాల‌పై దిగుమ‌తి సుంకాలు త‌గ్గించిన కేంద్రం.. ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లే వంట నూనెల ధ‌ర‌ల‌ను త‌గ్గించి ద్ర‌వ్యోల్బ‌ణాన్ని క‌ట్ట‌డి చేయ త‌ల‌పెట్టింది. ట్రేడ‌ర్లు, హోల్‌సేల్ వ్యాపారులు త‌మ వ‌ద్ద ఉన్న వివిధ ర‌కాల నూనెల నిల్వ‌ల వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని ఆదేశించింది.