శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న అమిత్ షా

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారలను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా దర్శనం కోసం ఆలయానికి వచ్చిన అమిత్ షా దంపతులకు ఘన స్వాగతం లభించింది. 

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దంపతులు, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి,  దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణిమోహన్, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్‌.రామారావు, అర్చకస్వాములు, వేద పండితులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అమిత్ షా దంపతులను ఆలయంలోకి తీసుకువెళ్లి స్వామి అమ్మవార్లను దర్శనం చేయించారు.
అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో అమిత్ షా దంపతులకు అర్చక స్వాములు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందించారు. 
తరువాత శ్రీశైలంలోని పంచమఠాలలో ఒకటైన ఘంటా మఠం జీర్ణోద్ధరణ సందర్భంగా లభించిన పురాతన తామ్ర శాసనాలను ఆలయ ప్రాంగణంలో నిశితంగా పరిశీలించారు. 

శ్రీశైల దేవస్థానం ఆలయ అధికారులు శాసనలకు సంబంధించిన చారిత్రాత్మక విశేషాలను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణిమోహన్, దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు వివరించారు. అనంతరం పశ్చిమ మాడ వీధిలో అర్జున మొక్కలను నాటి నీళ్లు పోశారు.

ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు అమిత్‌షా దంపతులు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం సున్నిపెంటకు వచ్చారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకున్నారు.