మోదీ పాలనలో తిరిగి వస్తున్న వారసత్వ సంపద

దొంగతనానికి గురైన మన దేశ వారసత్వ సంపదలో అత్యధిక భాగం ప్రధాని నరేంద్ర  మోదీ పరిపాలనలో తిరిగి వచ్చిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. 1976 నుంచి ఇప్పటి వరకు 54 కళాఖండాలను విదేశాల నుంచి తిరిగి తీసుకొచ్చినట్లు, వీటిలో అత్యధికం ఈ ఏడేళ్ళలో వచ్చినవేనని రాజ్యసభకు గురువారం లిఖితపూర్వకంగా తెలిపారు.

వారసత్వ సంపదకు సంబంధించిన అనేక కళాఖండాలను మన దేశం నుంచి దొంగిలించి, విదేశాలకు ఎత్తుకెళ్ళిపోయారని, వీటిలో చాలావాటిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదవీ కాలంలో తిరిగి తీసుకురాగలగడం గర్వకారణమని కిషన్ రెడ్డి తెలిపారు. గడచిన ఏడేళ్ళలో తిరిగి స్వాధీనం చేసుకున్న కళాఖండాల సంఖ్య అత్యధికమని తెలిపారు. 

2014 నుంచి ఇప్పటి వరకు 41 కళాఖండాలను రప్పించినట్లు చెప్పారు. తిరిగి వచ్చిన మొత్తం సంపదలో ఇది సుమారు 75 శాతమని వివరించారు. ప్రధాని మోదీ కృషి కారణంగానే వీటిని తిరిగి రప్పించగలిగినట్లు పేర్కొన్నారు. వివిధ దేశాల అధినేతలతో మోదీ వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకుంటున్నారని, ఫలితంగా మన దేశంతో ఇతర దేశాలతో సాంస్కృతిక సంబంధాలు నిరంతరం మెరుగుపడుతున్నాయని చెప్పారు. 

నెహ్రూ-గాంధీ కుటుంబ నేతలు కేవలం తమ స్వార్థం కోసం సంపదను పోగేసుకోవడంపైనే దృష్టి సారించారని ఆరోపించారు. భారత దేశ సాంస్కృతిక, నాగరికత సంబంధిత సంపదను కాపాడటంపై ఆ కుటుంబం నుంచి వచ్చిన నేతలు శ్రద్ధ చూపలేదని ధ్వజమెత్తారు. 1976 నుంచి దాదాపు పాతికేళ్ళు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కేవలం 10 కళాఖండాలను మాత్రమే వెనుకకు రప్పించగలిగాయని గుర్తు చేశారు.