పుల్వామా దాడి బాంబ్‌మేక‌ర్ అబూ సైఫుల్లా హ‌తం

జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాదంపై భద్రతా దళాలు గొప్ప విజయం సాధించాయి. అత్యంత భయానక ఉగ్రవాది ఇస్మాయిల్ భాయ్ వురపు లంబును శనివారం మట్టుబెట్టాయి. లంబు నుంచి ఓ ఏకే-47 రైఫిల్, ఓ ఎం-4 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు.  జైషే మ‌హ‌మ్మ‌ద్  ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన ఉగ్ర‌వాది అబూ సైఫుల్లా ఇవాళ జ‌మ్మూక‌శ్మీర్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మ‌య్యాడు.
అబూ సైఫుల్లాను లంబూగా పిలుస్తారు. ఇత‌నిది పాకిస్థాన్‌లో పంజాబ్ రాష్ట్రం. 2019లో జ‌రిగిన పుల్వామా దాడిలో ఇత‌ను ప్ర‌ధాన నిందితుడు. 
ఆ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆ దాడిలో వాడిన ఐఈడీ పేలుడు ప‌దార్ధాన్ని ఇత‌నే త‌యారు చేసిన‌ట్లు తెలుస్తోంది. దక్షిణ క‌శ్మీర్‌లో జైషే సంస్థ ఆప‌రేష‌న‌ల్ క‌మాండ‌ర్‌గా చేశాడ‌త‌ను. 
ఎన్‌క్రిప్ట్ మెసేజింగ్ అప్లికేష‌న్స్‌లో సైఫుల్లా నిపుణుడు. ఐఈడీ త‌యారీలోనూ నిష్ణాతుడు. అవంతిపురా నుంచి అత‌ను త‌న ఆప‌రేష‌న్స్ హ్యాండిల్ చేసేవాడు. సైఫుల్లాను అద్న‌న్ అని కూడా పిలుస్తార‌ని తెలుస్తోంది.  జైషే ఉగ్ర సంస్థ వ్య‌స్థాప‌కుడు మౌలానా మ‌సూద్ అజ‌ర్‌కు ద‌గ్గ‌రి బంధువు అని తెలుస్తోంది. 2017లో అత‌ను భారత్ లోకి అక్ర‌మంగా ప్ర‌వేశించాడు. అప్ప‌టి నుంచి ఇక్క‌డే ఉగ్ర కార్య‌క‌లాపాల‌ను ఆప‌రేట్ చేస్తున్నాడు.
 
కశ్మీరు ఐజీపీ విజయ్ కుమార్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అత్యున్నత స్థాయి పాకిస్థానీ ఉగ్రవాది లంబూ ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరొక ఉగ్రవాది కూడా మరణించాడని, అతని వివరాలను ఇంకా తెలుసుకోవలసి ఉందని చెప్పారు.
 
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ నెట్‌వర్క్ కశ్మీరులో బలహీనపడుతోందని, దీనిని బలోపేతం చేయడానికి లంబును  ఆ ఉగ్రవాద సంస్థ కశ్మీరుకు పంపించినట్లు తెలుస్తోంది. ఐఈడీలను తయారు చేయడంతోపాటు కొత్త ఉగ్రవాదులను చేర్చుకోవడం కోసం ఇతనిని పంపించినట్లు సమాచారం. ఆత్మాహుతి దాడులకు పాల్పడేవిధంగా యువతకు బ్రెయిన్‌వాష్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
 
పాక్ చొరబాదుదారుల కాల్చివేత 
 
మరోవంక,  పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ సరిహద్దుల్లో ఇద్దరు పాకిస్థాన్ చొరబాటుదారులను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కాల్చిచంపింది.ఫిరోజ్‌పూర్ సరిహద్దుల మీదుగా పాకిస్థాన్ దేశం నుంచి ఇద్దరు వ్యక్తులు భారతదేశంలోకి చొరబడేందుకు శుక్రవారం రాత్రి యత్నించారు. 
 
చొరబాటుదారులను గమనించిన భారత భద్రతా దళాలు ఆగిపోమ్మని పదేపదే హెచ్చరికలు చేసింది. బీఎస్ఎఫ్ బలగాల హెచ్చరికలను పట్టించుకోకుండా సరిహద్దుల్లో కంచె దాటి భారతదేశంలోకి వచ్చారు. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చొరబాటుదారులు మరణించారు.
 
ఇలా ఉండగా,  జ‌మ్మూక‌శ్మీర్‌ లో ఇటీవ‌ల డ్రోన్ల దాడులు ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న దృష్ట్యా ఆ రాష్ట్రంలో ఇవాళ ఎన్ఐఏ  4 చోట్ల సోదాలు నిర్వ‌మిస్తున్న‌ది. రెండు కేసులకు సంబంధించిన ఆ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. జ‌మ్మూ ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద ఉన్న ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై కొన్ని వారాల క్రితం డ్రోన్ దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. 
 
ఉగ్ర‌వాద సంస్థ ల‌ష్క‌రే ముస్తాఫాకు చెందిన మ‌రో కేసులోనూ ఎన్ఐఏ సోదాలు నిర్వ‌హిస్తున్న‌ది. సోఫియాన్‌, అనంత‌నాగ్‌, బ‌నిహ‌ల్‌తో పాటు సుంజ‌వాన్ లో నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ రెయిడ్స్ చేస్తోంది. జూన్ 27వ తేదీన జ‌రిగిన డ్రోన్ దాడిలో ఇద్ద‌రు ఐఏఎఫ్ ద‌ళ సిబ్బంది గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే.