ప్రపంచ వారసత్వ సంపదగా గుజరాత్ లోని ధోలావీరా

యునెస్కో భార‌త్‌కు మ‌రో శుభ‌వార్త అంద‌జేసింది. గుజ‌రాత్‌లోని ధోల‌విర ప్రాంతాన్ని ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద జాబితాలో చేర్చింది. హ‌ర‌ప్పా నాగ‌రిక‌త‌కు ధోల‌విర న‌గ‌రం ఓ గుర్తుగా నిలుస్తుంది. ప్రపంచ వారసత్వ జాబితాలో ధోలవిరాను కూడా చేర్చినట్లు యునెస్కో ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

చైనా నుంచి ఆన్‌లైన్‌లో జరుగుతున్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ధోలావీరా హరప్పా నాగరికత కాలంనాటిది. సామాన్య శకానికి పూర్వం (బీసీ) 1800లో దీనిని నిర్మించినట్లు తెలుస్తోంది. హరప్పా నాగరికత నాటి పట్టణంగా ధోలవిరా ప్రసిద్ధి చెందింది. కచ్‌ జిల్లాలో ఉన్న ఈ పట్టణం 4,500 ఏళ్ల చరిత్ర ఉందని ఆధారాలు ఉన్నాయి.

5వేల సంవత్సరాల పూర్వం ఇక్కడ ఆధునిక వసతులతో కూడిన నగర జీవనం ఉండేదని చరిత్రకారులు పేర్కొన్నారు. రాగి, షెల్‌, రాతితో చేసిన విలువైన ఆభరణాలు, టెర్రకోట, బంగారం, దంతాలతో రూపొందించిన అద్భుతమైన కళాఖండాలు ఈ నగరంలో గుర్తించినట్లు తెలిపారు.

1967-68లో జేపీ జోషీ నేతఅత్వంలోని పురావస్తు శాఖ బఅందం ఈ ప్రాంతాన్ని గుర్తించింది. సింధు నాగకరికత వెల్లివిరిసిన ఎనిమిది ప్రముఖ ప్రాంతాల్లో ఇది ఐదో అతిపెద్దది కావడం గమనార్హం.

దోల‌విరా ఇప్పుడు భారత్ లో 40వ వార‌స‌త్వ సంప‌ద‌గా నిలుస్తుంద‌ని కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జి కిష‌న్ రెడ్డి ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.  వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సైట్ల‌లో ఇండియా సూప‌ర్‌-40 క్ల‌బ్‌లో చేరింద‌ని మంత్రి వెల్ల‌డించారు. ఇండియా ఇవాళ గ‌ర్వ‌ప‌డాల్సిన దిన‌మ‌ని, ముఖ్యంగా గుజ‌రాతీ ప్ర‌జ‌ల‌కు ఇది శుభ‌దిన‌మ‌ని పేర్కొన్నారు.

2014 నుంచి భార‌త్‌లో కొత్త‌గా ప‌ది ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద‌లుగా జాబితాలో చేరాయ‌ని, ఇది మొత్తం సైట్ల‌లో నాలుగ‌వ వంతు అని, ప్ర‌ధాని మోదీ క‌మిట్‌మెంట్ వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని మంత్రి కిష‌న్ రెడ్డి తెలిపారు. భార‌తీయ సంస్కృతి, వార‌స‌త్వం, జీవ‌న విధానాన్ని ప్ర‌ధాని మోదీ ప్ర‌మోట్ చేస్తున్న తీరు ఆయ‌న దీక్ష‌ను చాటుతుంద‌ని మంత్రి వెల్లడించారు. 

తెలంగాణాలోని రామప్ప దేవాలయానికి జూలై 25న ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. హరప్పా నాగరికత కాలం నాటి ధోలావీరాకు మంగళవారం ఈ గుర్తింపు లభించింది. దీంతో మన దేశంలోని ప్రపంచ వారసత్వ సంపదల సంఖ్య 40కి చేరింది. 

గుజరాత్‌లో మొత్తం నాలుగు ప్రపంచ వారసత్వ సంపదలు ఉన్నాయి. అవి : ధోలావీరా, చంపనేర్, రాణీ కీ వావ్, అహ్మదాబాద్. ప్రకృతి సంబంధమైన, సాంస్కృతిక ప్రాధాన్యంగల ప్రదేశాలను ఈ విధంగా ప్రపంచ వారసత్వ సంపదలుగా గుర్తిస్తారు. ప్రస్తుత, భావి తరాలకు ఉమ్మడి ప్రాధాన్యంగలవాటికి ఈ గుర్తింపు లభిస్తుంది.