భారత్‌లో వేగంగా ముంచుకొస్తున్న కొవిడ్ మూడో దశ ముప్పు

భారత్‌లో కొవిడ్ మూడో దశ ముప్పు వేగంగా ముంచుకొస్తోంది. ఒకరోజు కేసులు తగ్గడం మరో రోజు పెరగడం ఇలా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న 30 వేలకు పడిపోయిన కేసులు నేడు (బుధవారం) 42 వేలకు పెరిగాయి. కొన్ని రోజులుగా కొత్త కేసులు కంటే రికవరీలు తక్కువగా ఉంటున్నాయి. 

వ్యాక్సినేషన్ భారీ ఎత్తున చేపట్టిన బ్రిటన్ వంటి చోట్ల ఇప్పుడు థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక్కవారంలో 40 శాతం కేసులు పెరిగాయి. మనదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కేసులు ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్నాయి. కేరళలో థర్డ్ వేవ్ మొదలైందన్న అనుమానాలు బలంగా ఉంటున్నాయి. 

మహారాష్ట్రలో కూడా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో రోజువారీ కేసులు 8 వేల నుంచి 10 వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఫస్ట్‌వేవ్, సెకండ్ వేవ్ ల్లో కూడా ఈ రాష్ట్రాలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాయి.

కేరళలో కాంటాక్ట్ ట్రేసింగ్‌ను పూర్తిగా వదిలేయడం ప్రమాదకరంగా మారిందని ఎపిడమోలజిస్టులు పేర్కొంటున్నారు. దీంతో కుటుంబంలో ఒకరి నుంచి మిగిలిన అందరికీ వ్యాధి సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. థర్డ్ వేవ్ విషయం మరో 15 21 రోజుల్లో స్పష్టంగా తెలిసిపోతుందని అంటున్నారు. 

ప్రస్తుతం దేశంలోని 13 రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాతో పాటు ఈశాన్యరాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళనకరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలంతా కరోనా గైడ్‌లైన్స్ తప్పక పాటించాలని, అప్పుడే కరోనా నాను కట్టడి చేయగలమని నిపుణులు సూచిస్తున్నారు.

దేశం లోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం సెకండ్‌వేవ్‌లో కేసులు ఏ విధంగా పెరిగాయో అలాంటి ట్రెండే థర్డ్ వేవ్‌లో కూడా కనిపించ వచ్చని అంచనా వేస్తున్నారు. 1918 లో వచ్చిన స్పానిష్ ప్లూతో కరోనాను ఇప్పుడు పోల్చి వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 

స్పానిష్ ఫ్లూ థర్డ్ వేవ్, ఫస్ట్‌వేవ్ దాదాపు ఒకేలా ఉన్నాయని, సెకండ్ వేవ్ మాత్రం ప్రళయాన్ని తలపించిందని బాబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి పరిశోధకులు భావిస్తున్నారు. కొవిడ్ విషయంలో అలా జరగవచ్చని చెబుతున్నారు. రద్దీగా ఉండే ప్రధాన పట్టణాల్లోని ప్రజలు ఇప్పటికే కొవిడ్ ప్రభావానికి గురి కావడంతో వ్యాప్తి తీవ్రత తగ్గవచ్చు. 

మరోవంక,  దేశంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 41,76,56,752 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2.88 కోట్ల మోతాదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఇప్పటి వరకు 43,25,17,330 వ్యాక్సిన్ మోతాదులను అందించినట్లు వివరించింది. 

బుధవారం నాటికి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ 187వ రోజుకు చేరగా.. ఒకే రోజు 20,83,892 వ్యాక్సిన్ మోతాదులను అందించారు. ఇందులో 10,04,581 మొదటి మొతాదులు కాగా.. 95,964 మందికి రెండో డోసు వేశారు. 18-44 ఏజ్‌ గ్రూప్‌లో 13,04,46,413 మంది వారి మొదటి.. మరో 53,17,567 మందికి రెండో మోతాదు అందజేసినట్లు వివరించింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు 18-44 ఏజ్‌ గ్రూప్‌లో కోటికిపైగా మోతాదులు వేశాయని చెప్పింది.