అమెరికా నుంచి భారత్ కు లైన్ క్లియర్

అమెరికా నుంచి భారత్ రావాలనుకునేవారికి బైడెన్ సర్కారు లైన్ క్లియర్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న ట్రావెల్ బ్యాన్ ఆంక్షలను సడలించింది. గతంలో ఇష్యూ చేసిన ట్రావెల్ అడ్వైజరీ ప్రకారం లెవల్–4  (నో ట్రావెల్) ఆంక్షలు ఉండగా.. తాజాగా లెవల్–3కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
భారత్‌లో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుదల కొనసాగుతుండడంతో అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) లెవల్–3 ట్రావెల్ హెల్త్ నోటీసును జారీ చేసింది. దీని ప్రకారం ఆంక్షలు సడలింపుపై అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.
 
లెవల్‌–3 అడ్వైజరీ ప్రకారం కరోనా సోకే రిస్క్ ఎక్కువగా ఉందనే అర్థం. అయితే కరోనా ప్రొటోకాల్ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయవచ్చు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారినపడే ముప్పు తగ్గుతుంది. వ్యాక్సిన్ వేయించుకోని వాళ్లు విదేశీ ప్రయాణం చేసే ముందు సీడీసీ సిఫారసులను పరిశీలించి నిర్ణయం తీసుకోండి”అని సూచించింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న సమయంలో మే 5న భారత్‌పై అమెరికా ట్రావెల్ బ్యాన్ విధించింది.

భారత్‌తో పాటు పాకిస్థాన్‌ ట్రావెల్‌ను కూడా లెవల్–4 నుంచి లెవల్–3లోకి తీసుకొచ్చినట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అయితే భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉండడంతో హెల్త్ అడ్వైజరీ పరంగా లెవల్‌–2 (కరోనా రిస్క్ తక్కువ)ను ఇష్యూ చేస్తూ సీడీసీ నిర్ణయం తీసుకుంది. 

 
కానీ ఆ సూచనను అమెరికా విదేశాంగ శాఖ పక్కన పెట్టింది. పాకిస్థాన్‌లో కరోనా రిస్క్ తక్కువగా ఉన్నా.. టెర్రరిస్టుల ముప్పు ఎక్కువని అందుకే లెవల్‌–3 ట్రావెల్ అడ్వైజరీనే జారీ చేస్తున్నామని ప్రకటించింది.
 
‘‘పాకిస్థాన్‌కు ప్రయాణించాలనుకునే వాళ్లు ఒక్క ఆలోచించుకోండి. అక్కడ టెర్రరిజం, హింస ఎక్కువగా ఉంటుందన్నది దృష్టిలో పెట్టుకోండి. కరోనా విషయంలోనూ జాగ్రత్తలు పాటించండి. ట్రావెల్ అడ్వైజరీని పూర్తిగా చదివిన తర్వాతే ప్రయాణం చేయండి” అని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.