కోవిడ్ వార్డులో సేవలందించిన కుమార్తెకు తండ్రిని

కోవిడ్-19 మహమ్మారిపై పోరాడే యోధులను ప్రోత్సహించడానికే ప్రజల చేత కరతాళ ధ్వనులు చేయించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రాజ్యసభకు తెలిపారు. తన కుమార్తె ఇంటర్న్ డాక్టర్‌ అని, తాను కోవిడ్ వార్డులోనే పని చేస్తానని ఆమె చెప్పారని, కరతాళ ధ్వనుల విలువ ఏమిటో తనకు అప్పుడు తెలిసిందని భావోద్వేగంతో  చెప్పారు. కరతాళ ధ్వనుల వల్ల తమలో ధైర్యం పెరిగిందని పేర్కొన్నారు.
దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై ప్రతిపక్షాలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వివరించింది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను తెలియజేసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా మన్‌సుఖ్ మాండవీయ రాజ్యసభలో మాట్లాడుతూ  ప్రజల చేత కరతాళ ధ్వనులు ఎందుకు చేయించారని కొందరు ప్రశ్నిస్తున్నారని  గుర్తు చేశారు.
మనల్ని రక్షించడానికి రోడ్లపై నిల్చున్న పోలీసు సిబ్బందిని, అన్ని స్థాయుల్లోని ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని గౌరవించేందుకు  తాము కరతాళ ధ్వనులు చేయించామని స్పష్టం చేశారు. వీరంతా కరోనా వైరస్ మహమ్మారి సమయంలో మనల్ని కాపాడటానికి కృషి చేశారని గుర్తు చేశారు. తాను మంత్రిని కావడానికి ముందు ఓ కుమార్తెకు తండ్రినని చెప్పారు.
 తన కుమార్తె కోవిడ్ వార్డులో ఇంటర్న్ డాక్టర్‌గా చేశారని పేర్కొంటూ తాను ఆ వార్డులోనే పని చేస్తానని ఆమె తనతో చెప్పారని,  కరతాళ ధ్వనుల విలువ ఏమిటో తనకు అప్పుడు తెలిసిందని తెలిపారు. ఈ కార్యక్రమం తమకు ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు.

కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ రాతపూర్వకంగా రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో 2021 ఏప్రిల్, మే నెలల్లో రెండో ప్రభంజనం తీవ్రత దృష్ట్యా కోవిడ్-19 రోగులకు క్లినికల్ కేర్ సక్రమంగా అందేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను అమలు చేసిందని వివరించారు. 

మెడికల్ ఆక్సిజన్, ఇతర పరికరాలను అందజేయడం ద్వారా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించిందని తెలిపారు. కోవిడ్ మొదటి ప్రభంజనంలో 3,095 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ ఉండేదని, రెండో ప్రభంజనంలో ఈ డిమాండ్ మునుపెన్నడూ లేనివిధంగా 9,000 మెట్రిక్ టన్నులకు పెరిగిందని చెప్పారు. 

ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమానంగా మెడికల్ ఆక్సిజన్ పంపిణీ జరిగేలా చూసిందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చించి, సంబంధిత మంత్రిత్వ శాఖలు, మాన్యుఫ్యాక్చరర్లు/సప్లయర్లు వంటి ఇతర వర్గాలతో సంప్రదింపులు జరిపి మెడికల్ ఆక్సిజన్ కేటాయింపులు చురుగ్గా, పారదర్శకంగా జరిపినట్లు తెలిపారు. 

కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనంలో ఆక్సిజన్ కొరత వల్ల రోగులు మరణించినట్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నిర్దిష్టమైన సమాచారం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  అయితే మొదటి ప్రభంజనం కన్నా రెండో ప్రభంజనం సమయంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ మునుపెన్నడూ లేనంత పెరిగిందని పేర్కొంది.