మణిపూర్ కాంగ్రెస్ లో సంక్షోభం…. బిజెపిలోకి వలసలు 

 దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా మరో రాష్ట్రంలో భారీ షాక్‌ తగిలింది. ఈశాన్య రాష్ట్రల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతున్న బీపీపి ధాటికి కాంగ్రెస్‌ కుదేలవుతుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్ లో కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి భారీ షాక్‌ తగిలింది. 
 
మణిపూర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్ష పదవికి గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు పూడ్చలేని నష్టమనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 
 
గోవిందాస్‌ కొంతౌజమ్‌ వరుసగా ఆరు సార్లు బిష్నాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంపీసీసీకి చీఫ్‌ విప్‌గా కూడా పని చేశారు. గతేడాది డిసెంబర్‌లో సోనియా గాంధీ ఆయనను మణిపూర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా నియమించారు.
 
 నెల క్రితం వరకు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌పై తీవ్ర విమర్శలు చేసిన గోవిందాస్‌ ఇంత అనూహ్యంగా పార్టీ మారుతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. 2017లో తొలిసారిగా బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
 
2017 ఎన్నికల్లో అధికార పార్టీ కంటే కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు సాధించినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 31 సీట్లను గెలువలేకపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 28, బీజేపీ 21, ఎన్‌పీఎఫ్‌, ఎన్‌పీపీ నాలుగు సీట్లు సాధించాయి. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో ప్రస్తుతం 56 మంది సభ్యులున్నారు.
 
బీజేపీకి 25 మంది సభ్యులు, కాంగ్రెస్‌కు 17 మంది సభ్యుల బలం ఉన్నది. ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌కు నలుగురు సభ్యులున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్యే, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. సభలో ప్రస్తుతం నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌, ముగ్గురు స్వతంత్రుల సహకారంతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం కూటమిలో 36 మంది ఎమ్మెల్యేలున్నారు.