ఉగ్రవాదుల దుశ్చర్యలను తిప్పికొట్టే సాంకేతికత 

భారతదేశ ప్రయోజనాలను, లక్ష్యాలను దెబ్బతీసేలా ఉగ్రవాదులు పన్నుతున్న కుట్రలను భగ్నం చేసేందుకు అవసరమైన సాంకేతికతను వృద్ధి చేయడంలో ఐఐటీ వంటి పరిశోధనా సంస్థలు కృషిచేయాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

ఐఐటీ మద్రాసు ప్రాంగణంలో తొలిసారిగా త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో రూపొందించిన నిర్మాణాన్ని ఉపరాష్ట్రపతి సందర్శిస్తూ ఇటీవలికాలంలో ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు కుట్రలు పన్నుతున్న ఘటనలను ప్రస్తావించారు.

విశ్వమానవాళికి ఉగ్రవాదం ప్రధానమైన శత్రువుగా మారిందన్న ఆయన, మిలటరీ రాడార్లు కూడా పసిగట్టలేని పద్ధతులను వినియోగిస్తున్న ఉగ్రవాదులకు దీటైన సమాధానం ఇవ్వాలని కోరారు. ఐఐటీ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పరిశోధన సంస్థలు సైతం ఈ దిశగా కృషిచేయాల్సిన తక్షణావసరం ఉందని పేర్కొన్నారు.

జాతీయ ప్రయోజనాలను, ప్రాంతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. సాంకేతిక అభివృద్ధి దిశగా దేశాన్ని ముందుకు నడిపించడంలో ఐఐటీల వంటి ఉన్నతవిద్యా సంస్థలు కృషిచేయాలని సూచించారు. సమాజానికి అవసరమైన అంశాల్లో పరిశోధలను విస్తృతం చేయాలని ఉపరాష్ట్రపతి చెప్పారు.

విద్యాలయాలు, పరిశ్రమలు పరస్పర సమన్వయంతో కృషిచేస్తే భారతదేశంలో మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చని, ఈ దిశగా కృషిచేస్తే భారతదేశంలో సాంకేతికత వృద్ధి చెందుతుందని తెలిపారు. అలాగే పరిశ్రమల రంగం ఎదుర్కొంటున్న నిపుణులైన మానవవనరుల కొరత కూడా తీరుతుందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.