విజయవంతంగా అగ్ని-ప్రైమ్ క్షిప‌ణి ప‌రీక్ష

అణ్వాయుధ సామ‌ర్థ్యం క‌లిగిన అగ్ని-ప్రైమ్ క్షిప‌ణిని ఇవాళ భార‌త్ విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. అగ్ని మిస్సైల్ సిరీస్‌లో భాగ‌మైన అగ్ని ప్రైమ్‌ను ఇవాళ ఉద‌యం 10.55 నిమిషాల‌కు ఒడిశా తీరంలో ప‌రీక్షించారు. చాందీపూర్‌లోని నాలుగ‌వ లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని ప్ర‌యోగించారు. 

అగ్ని ప్రైమ్‌ ఓ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌. అది వెయ్యి నుంచి 1500 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధించ‌గ‌ల‌దు. దీంట్లో ఎన్నో అడ్వాన్స్ ఫీచ‌ర్లు ఉన్నాయి. సుమారు వెయ్యి కిలోల పేలోడ్‌ను ఈ మిస్సైల్ మోసుకెళ్ల‌గ‌ల‌దు. దీనికి అణ్వాయుధ సామ‌ర్థ్యం కూడా ఉన్న‌ది.

అగ్ని-1 సింగిల్ స్టేజ్ మిస్సైల్ కాగా.. అగ్ని ప్రైమ్‌లో రెండు స్టేజీలు ఉన్నాయి. కొత్త టెక్నాల‌జీతో అగ్ని ప్రైమ్ క్షిప‌ణిని నిర్మించారు. దీంతో దీని బ‌రువు గ‌త అగ్ని వ‌ర్ష‌న్ల‌తో పోలిస్తే త‌క్కువ‌గా ఉంటుంది. అగ్ని-4, అగ్ని5 మిస్సైళ్ల‌లో ఉన్న టెక్నాల‌జీ క‌న్నా తేలిక‌గా అగ్ని ప్రైమ్ ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

 ‘‘సముద్ర తీరం వెంబడి ఏర్పాటు చేసిన వివిధ టెలీమెట్రీ, రాడార్ కేంద్రాలు మిసైల్ గమనాన్ని నిశితంగా పరిశీలించాయి. అగ్నిప్రైమ్ మిసైల్ నిర్దేశిత మార్గంలోనే ప్రయాణించి మిషన్ ప్రమాణాలన్నిటినీ అందుకుంది’’ అని డీఆర్‌డీఓ పేర్కొంది. 

కాంపోసిట్ పదార్థాలతో రూపుదిద్దుకున్న ఈ మిసైల్ అణు వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా సునాయసంగా ధ్వంసం చేసే సామర్థ్యం ఈ మిసైల్ సొంతమని రక్షణ రంగ నిపుణులు తెలిపారు. అగ్ని-1 బాలిస్టిక్ మిస్సైల్‌ను భారత్ లో తొలిసారి 1989లో ప‌రీక్షించారు. 2004లో ఆ క్షిప‌ణుల‌ను వినియోగంలోకి తెచ్చారు.