టీటీడీకి పట్టని యోగా దినోత్సవం

ప్రపంచ వ్యాప్తంగా సోమవారం యోగ దినోత్సవాన్ని నిర్వహించినా, టీటీడీలో మాత్రం ఆ ఊసే కనిపించలేదు. టిటిడి విద్యాసంస్థలలో సహితం ఎక్కడ యోగా దినోత్సవం జరిపిన దాఖలాలు లేవు. 

గతంలో టీటీడీ ఆధ్వర్యంలో యోగా నేర్పించే విద్యా సంస్థ ఉండేది. డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను నిర్వహించి ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లు ఇచ్చేవారు. నిత్యం యోగ సాధన చేసే వారి కోసం పాత మెటర్నిటీలో హాల్‌ను కూడా కేటాయించేవారు.  అనంతరం టీటీడీ విద్యాశాఖ పరిధిలోని యోగా సంస్థను ఆయుర్వేద కళాశాల పరిధిలోకి తెచ్చింది. టీటీడీ ఆయుర్వేద కళాశాల నిర్వాహకులు యోగాను నిర్లక్ష్యం చేశారు.

గతంలో ఆయుర్వేద కళాశాల సెల్లార్‌లో  కొన్ని క్లాసులు తూతూమంత్రంగానైనా నిర్వహించేవారు. ఏది ఎలా ఉన్నా టీటీడీ యోగా దినోత్సవాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. రెండేళ్ల కిందటి వరకు సంస్కృత విద్యాపీఠంతో కలిసి టీటీడీ యోగా దినోత్సవాన్ని ఓ ఉత్సవంలా నిర్వహించేది. 

రాష్ట్రంలో రాష్ట్రంలో వై ఎస్  జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గత రెండేళ్లుగా  యోగా దినోత్సవాన్ని టీటీడీ నిర్లక్ష్యం చేసింది. సనాతన ధర్మంలో ఎంతో కీలకమైన యోగాను టీటీడీ లాంటి ధార్మికసంస్థ పట్టించుకోక పోవటం చర్చనీయాంశంగా మారింది. 

జగన్ పాలనలో టిటిడిలో అన్యమతస్థుల ప్రాబల్యం పెరుగుతున్నదని ఆరోపణలు చెలరేగుతూ  ఉండడం, టిటిడిలో పనిచేస్తున్న అన్యమతాలకు చెందిన ఉద్యోగులను తొలగించడం పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా  వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం. ఇటువంటి సమయంలో యోగా దినోత్సవంను పట్టించుకొనక పోవడం ప్రభుత్వ ధోరణిని వెల్లడి చేస్తున్నది.

కాగా, కొవిడ్‌ సెంటర్లలో నిత్యం యోగ శిక్షణ ఇస్తున్నారు. ఎందరో కరోనా బాధితులు యోగ సాధన చేస్తున్నారు. అలాంటి చోట్లనైనా యోగా దినోత్సవాన్ని టీటీడీ నిర్వహించలేదు. గతంలో నిర్వహించిన యోగా కోర్సులు ఇప్పుడు టీటీడీలో లేవు.