వ్యాక్సిన్లు తీసుకోండి, కొవిడ్‌పై పోరును బలోపేతం చేయండి

వ్యాక్సిన్లు తీసుకోండి, కొవిడ్‌పై కలిసికట్టు పోరును బలోపేతం చేయండని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్‌లో సోమవారం నుంచి కీలక ఘట్ట ఆరంభం అయింది. 18 సంవత్సరాలు పైబడ్డ వయోజనులందరికీ ఉచిత టీకాలు అందించే ఈ కార్యక్రమాన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని కోరారు. 

తొలిరోజే రికార్డు స్థాయిలో టీకాలు వేసుకోవడం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ‘‘వ్యాక్సినేషన్ ఇంత పెద్ద మొత్తంలో జరగడం ఆనందదాయకం. కోవిడ్‌కు వ్యతిరేకంగా ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్. చాలా మంది పౌరులకు వ్యాక్సిన్ సక్రమంగా అందేలా కృషి చేస్తున్న ఫ్రంట్‌లైన్ యోధులకు, టీకాలు వేసుకున్న వారికి ధన్యవాదాలు. వెల్‌డన్ ఇండియా’’ అంటూ ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.

భారీఎత్తున టీకా పంపిణీని ప్రశంసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘‘ఇవి కళ్లుచెదిరే గణాంకాలు. టీకా తీసుకున్నవారికి అభినందనలు. వేసిన ఆరోగ్య కార్యకర్తలకు అభివందనాలు. శభాష్‌ భారత్‌’’ అని కొనియాడారు. 

అంతకుముందు వ్యాక్సినేషన్‌ ప్రారంభ సందర్భంగా చేసిన ట్వీట్‌లో ‘‘ఈ విడతలో ప్రధానంగా లబ్ధి పొందేది పేద, మధ్య తరగతి వర్గాలు, యువతే. టీకా తీసుకుంటామని మనందరం ప్రతిజ్ఞ చేయాలి. అందరం కలిస్తేనే కరోనాను ఓడించగలం’’ అని పేర్కొన్నారు.  

వ్యక్తులు ప్రతి ఒక్కరూ ఈ దిశలో తమ బాధ్యతను గుర్తుంచుకుని టీకాలు వేయించుకోవాలి. ఈ దిశలో ఇది వారికే కాదు దేశ ప్రజలందరికీ ఉపయుక్తం అవుతుంది. ప్రత్యేకించి కొవిడ్‌పై జాతిచేపట్టిన పోరు సంఘటితం, బలోపేతం అయ్యేందుకు దారితీస్తుందని ప్రధాని తెలిపారు. 

కేంద్రం నుంచి పేదలు, మధ్యతరగతి ప్రజలు, యువతకు ఉచిత వ్యాక్సిన్లు అందించే దిశలో ప్రాధాన్యతను కల్పిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఇప్పటి ఈ వ్యాక్సినేషన్ దశ ఈ లక్షంతోనే సాగుతుందని తెలిపారు. ప్రజా ప్రాతినిధ్యంతోనే కొవిడ్‌పై పోరు విషయంలో మనం మరింతగా ముందుకు సాగేందుకు అవసరం అయిన శక్తిని సంతరించుకుంటామని చెప్పారు. 

వ్యాక్సిన్లు ఎంతో సురక్షితం, ప్రయోజనకరం అని చెపుతూ దీనికి సంబంధించిన పలు కీలక గ్రాఫిక్స్‌ను ప్రధాని తమ ట్వీటుతో పాటు పొందుపర్చారు. టీకాలపై ప్రజలు వదంతులను నమ్మరాదని, వ్యాక్సిన్లు వేసుకునేందుకు తరలిరావాలని పిలుపు నిచ్చారు. 

ప్రపంచ స్థాయి అతి పద్ద వ్యాక్సినేషన్ ఉద్యమం అనే శీర్షికతో వెలువడ్డ ప్రధాని సందేశంలో ఇప్పటివరకూ జరిగిన టీకాల గణాంకాలు ఇతర వివరాలను పొందుపర్చారు. 

రాష్ట్రాలపై భారం పడకుండా కేంద్రం దేశంలోని 18 ఏండ్లు పైబడ్డవారందరికి ఉచితంగా వ్యాక్సిన్లు అందించేందుకు ముందుకు వచ్చింది. డిసెంబర్ నాటికి దేశంలో అత్యధిక శాతం జనాలకు టీకాలు అందాలనే ఆశాభావం లక్షంతో కేంద్రం ముందుకు వచ్చిందని ప్రధాని తెలిపారు.