లాక్‌డౌన్ల ఎత్తివేతతో గాడినపడుతున్న ఆర్థిక వ్యవస్థ

రాష్ట్రాల్లో లాక్‌డౌన్ల ఎత్తివేతతో దేశ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటున్నదని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ తెలిపింది. కరోనా మహమ్మారి రెండో దశ.. భారత్‌ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వైరస్‌ కట్టడికి దాదాపు అన్ని రాష్ట్రాలు  లాక్‌డౌన్‌ దిశగా పయనించిన సంగతీ విదితమే. 

ఇప్పుడు కేసులు భారీగా తగ్గుముఖం పట్టడంతో మెజారిటీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ నుంచి బయటకు వస్తున్నాయి. తెలంగాణ సైతం లాక్‌డౌన్‌కు గుడ్‌బై చెప్పినదీ తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు రెండు నెలలు స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలు.. తిరిగి పునరుద్ధరణ దిశగా నడుస్తున్నాయని ఫిక్కీ తాజా సర్వేలో అభిప్రాయపడింది.

కరోనా ఆంక్షల నుంచి అన్ని రాష్ట్రాలు బయటకు వస్తున్న నేపథ్యంలో రాబోయే 6-12 నెలలు ఆయా సంస్థల పనితీరు ఆశాజనకంగా ఉంటుందని ఫిక్కీ అంచనా వేసింది. 212 కంపెనీలతో ఫిక్కీ, ధ్రువ అడ్వైజర్స్‌ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించగా, ఇందులో దాదాపు 60 శాతం సంస్థలు లాక్‌డౌన్లతో తీవ్రంగా ప్రభావితమైనట్లు తెలిపాయి. ఉత్పత్తి, డిమాండ్‌ అంతా మందగించాయని పేర్కొన్నాయి.

కాగా, కరోనా సెకండ్‌ వేవ్‌తో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమని వాణిజ్య, పారిశ్రామిక సంఘం పీహెచ్‌డీసీసీఐ అన్నది. దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాలను తగ్గించాలని, ముఖ్యంగా ప్రధాన ముడి సరుకుల దిగుమతి భారం కాకుండా చూడాలని పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు సంజయ్‌ అగర్వాల్‌ చెప్పారు. 

అప్పుడే ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) ఆకర్షణీయమైన వృద్ధిరేటును సాధించగలదని పేర్కొన్నాన్నారు. గృహస్తుల వినిమయ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.