చైనాలో ఒక రోజు ముందుగా యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒకరోజు ముందుగా చైనాలో యోగా చేశారు. అక్కడి భారత రాయబార కార్యాలయంలో జరిపిన యోగా వేడుకల్లో వంద మందికి పైగా చైనా యోగా ప్రేమికులు పాల్గొన్నారు. జూన్ 21 ని అంతర్జాతీయ యోగా దినంగా 2014 సంవత్సరంలో ప్రకటించినప్పటి నుంచి భారతదేశపు ప్రాచీన యోగా విధానం చైనాలో చాలా ప్రసిద్ది చెందింది. 

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చైనాలో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇండియా హౌస్‌లో ఏర్పాటు చేసిన ఈ యోగా కార్యక్రమానికి చైనాలో భారత రాయబారి విక్రమ్ మిశ్రీ, డిప్యూటీ అంబాసిడర్ డాక్టర్ అక్వినో విమల్ హాజరయ్యారు.

కొవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి కారణంగా శారీరక, ఆధ్యాత్మిక ప్రాతిపదికన ఆరోగ్యంగా ఉండటానికి యోగా మన మార్గం సుగమం చేసిందని భారత రాయబారి విక్రమ్‌ మిశ్రీ చెప్పారు. బాహ్య సమస్యల కారణంగా మానసిక స్థితి కూడా మెరుగ్గా ఉండలేని సమయంలో.. యోగా ద్వారా కొత్త కోణాన్ని కనుగొంటున్నామని పేర్కొన్నారు.

యోగాతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పాజిటివ్ థింకింగ్‌ కూడా అలవడుతుందని మిశ్రీ తెలిపారు. నిత్యం అర్ధగంట పాటు యోగా అలవాటు చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని పేర్కొన్నారు.

భారత రాయబార కార్యాలయంలోని స్వామి వివేకానంద సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన యోగా కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. మోహన్‌ భండారీ పునాది వేసిన యోగి-యోగా పాఠశాలలో చాలా మంది చైనీస్ యోగా ఉపాధ్యాయులు గంటకు పైగా కొనసాగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.