వరుసగా మూడోసారి కొలువు తీరిన మమతా 

టిఎంసి అధినేత్రి మమతా బనెర్జీ వరుసగా మూడోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొలువు తీరారు. కోవిద్ దృష్ట్యా రాజ్ భవన్ లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఆమెచేత ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా ప్ర‌మాణం చేసిన త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ ఆమెను అభినందించారు.
కోవిడ్ ప్రోటోకాల్ కారణంగా మమతా బెన‌ర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా క్లుప్తంగా జరిగింది. మ‌మ‌తా బెంగాలీలో ప్ర‌మాణస్వీకారం చేశారు.
అంత‌కుమందు పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశం అనంతరం టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థా ఛటర్జీ విలేకరులతో మాట్లాడుతూ  కొత్తగా ఎన్నికైన సభ్యులు మే 6 న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తార‌ని తెలిపారు.
ఎన్నికల అనంతరం బెంగాల్ లో పెద్ద ఎత్తున హింస చెలరేగడం, కనీసం 14 మంత్రి మరణించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆమె తక్షణం హింసను నిలిపి వేసేందుకు పటిష్టంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని ఆదేశించారు.  ఈ హింస‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ప్ర‌ధాని మోదీ.. మంగ‌ళ‌వారం రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జ‌గ్‌దీప్‌తో ఫోన్‌లో మాట్లాడిన విష‌యం తెలిసిందే. కోవిద్ ను కట్టడి చేయడమే తమ ప్రభుత్వం ముందున్న అత్యధిక ప్రాధాన్యత గల అంశమని ఆమె ప్రకటించారు.
బెంగాల్‌లో కొనసాగుతున్న హింసపై వ‌స్తున్న వార్త‌ల‌పై మమతా బెనర్జీ స్పందిస్తూ… ప్రతి ఒక్కరూ శాంతిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏ పార్టీకి చెందిన‌వారైనా హింసకు పాల్పడితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని స్పష్టం చేశారు. తాను శాంతియుత వాతావర‌ణానికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాన‌ని, దానినే కొన‌సాగిస్తాన‌ని చెప్పారు.
 ఈ సంద‌ర్బంగా గవర్నర్ జగదీప్ మాట్లాడుతూ సీఎం మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని గౌర‌విస్తార‌ని, హింసాయుత ఘ‌ట‌న‌ల‌పై కఠిన చర్యలు తీసుకుంటార‌ని భావిస్తున్నాన‌ని ఆశాభావం వ్యక్తం చేశారు.  కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 292 సీట్లలో 213 సీట్లను గెలుచుకున్న టీఎంసీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. 77 స్థానాలను బీజెపీ గెలుచుకుంది.
పశ్చిమ బెంగాల్ 17 వ అసెంబ్లీ నాయకురాలిగా మమతా బెనర్జీని ఎన్నుకున్న‌ట్లు టీఎంసీ పార్టీ నుంచి సమాచారం వచ్చిన తరువాత, మే 5 న ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బెనర్జీని రాజ్ భవన్‌కు ఆహ్వానించామ‌ని గ‌వ‌ర్న‌ర్‌ అని ధన్‌కర్ ట్వీట్ చేశారు.  కాగా తృణమూల్ ఎమ్మెల్యేలు ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ విమన్ బెనర్జీని కొత్త అసెంబ్లీ యాక్టింగ్ స్పీకర్‌గా ఎన్నుకున్నారు.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో పోటీచేసిన మమతా బెనర్జీ తన సమీప బీజేపీ అభ్యర్థి సువేంధు అధికారి చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లో మమత ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది.
పశ్చిమబెంగాల్‌లో శాసనమండలి ఉండి ఉంటే మమత వెంటనే ఎమ్మెల్సీగా ఎన్నికై ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉండేది. కాకపోతే అక్కడ శాసనమండలి లేకపోవడంతో ఇప్పుడు విధిగా ఆమె ఆరో నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిందే.