మ‌రో రెండు నెల‌లు ఉచిత‌ ఆహార ధాన్యాల పంపిణీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ఫేజ్-3 క్రింద అదనంగా ఆహార ధాన్యాలను మే, జూన్ నెలల్లో పంపిణీ చేయాలని నిర్ణయించారు. 

నెలకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా అందజేయాలని నిర్ణయించారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకంతో సహా మొత్తం లబ్ధిదారుల సంఖ్య దాదాపు 79.88 కోట్లు ఉంటుందని అంచనా. జాతీయ ఆహార భద్రత చట్టం క్రింద అమల్లో ఉన్న కేటాయింపుల దామాషా ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గోధుమలు, బియ్యం కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

స్థానికంగా అమలవుతున్న లాక్‌డౌన్ పరిస్థితులు, తుపానులు, భారీ వర్షాలు, ఆహార సరఫరాలు, కోవిడ్ సంబంధిత ఆంక్షలు వంటివాటిని దృష్టిలో ఉంచుకుని ఈ ఉచిత పంపిణీని ఎంత కాలం కొనసాగించాలో ఆహార, ప్రజా పంపిణీ శాఖ నిర్ణయిస్తుందని తెలిపింది. మొత్తం మీద సుమారు 80 ఎల్ఎంటీ ఆహార ధాన్యాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. 

సుమారు 79.88 కోట్ల మందికి నెలకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున రెండు నెలలపాటు పంపిణీ చేయడానికి ఆహార సబ్సిడీ సుమారు రూ.25,332.92 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపింది.  మొత్తం మీద ఒక మెట్రిక్ టన్ను బియ్యానికి రూ.36,789.2; ఒక మెట్రిక్ టన్ను గోధుమలకు రూ.25,731.4 ఖర్చవుతుందని తెలిపింది.

కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక ఇబ్బందుల వల్ల పేదల కష్టాలను తొలగించేందుకు ఈ అదనపు సరఫరా దోహదపడుతుందని పేర్కొంది. మే, జూన్ నెలల్లో ఆహార ధాన్యాలు లేవనే కారణంతో పేద కుటుంబాలు ఇబ్బందులు అనుభవించవలసిన అవసరం ఉండదని చెప్పింది. 

పీఎం-కేర్స్ నిధులతో న్యూఢిల్లీలోని ఎయిమ్స్, ఆర్ఎంఎల్ ఆసుపత్రుల్లో రెండు హై ఫ్లో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు, వీటి నిర్మాణం పూర్తయినట్లు వివరించింది. వీటి నుంచి కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా బుధవారం నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. 

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తరిస్తోందని, 16 కోట్ల మందికి వ్యాక్సినేషన్ జరగడంతో, ఇంత భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ వేగంగా చేసిన దేశంగా మన దేశం రికార్డు సృష్టిస్తోందని తెలిపింది. 18-44 సంవత్సరాల వయసుగలవారిలో సుమారు 6.7  లక్షల మందికి ఫేజ్-3లో వ్యాక్సినేషన్ చేసినట్లు తెలిపింది.