బెంగాల్ హింస‌పై ప్ర‌ధాని ఆందోళ‌న‌.. గ‌వ‌ర్న‌ర్‌కు ఫోన్‌

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత జ‌రిగిన హింస‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జ‌గ్‌దీప్ ధ‌న్‌క‌ర్‌కు ఫోన్ చేశారు. రాష్ట్రంలో లూటీలు, హత్యలు జరుగుతుండటంపై తీవ్ర ఆందోళన, మనోవేదన వ్యక్తం చేశారు. ఈ విష‌యాన్ని గ‌వ‌ర్న‌రే ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

రాష్ట్రంలో దిగ‌జారుతున్న శాంతి భ‌ద్ర‌త‌ల‌పై ప్ర‌ధాని తీవ్ర ఆవేద‌న‌, ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ జ‌గ్‌దీప్ ఆ ట్వీట్‌లో తెలిపారు. రాష్ట్రంలో హింస, విధ్వంసం, దహనకాండ, దోపిడీలు, హత్యలు నిరాఘాటంగా కొనసాగుతున్నాయని ప్రధాన మంత్రికి తెలిపానని పేర్కొన్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు సంబంధితులు తక్షణం చర్యలు ప్రారంభించాలని సూచించారు.  ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజార్టీతో తృణ‌మూల్ కాంగ్రెస్ గెలిచిన త‌ర్వాత బెంగాల్‌లో హింస చెల‌రేగింది.

ఈ హింస‌లో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హింస‌పై స్పందించిన మోదీ మంగ‌ళ‌వారం గ‌వ‌ర్న‌ర్‌కు ఫోన్ చేసి ప‌రిస్థితుల‌పై ఆరా తీశారు. ఆ త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ జ‌గ్‌దీప్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో హింస‌, విధ్వంసం, లూటీ, ద‌హ‌నాలు, హ‌త్య‌లు నిరంత‌రాయంగా కొన‌సాగుతుండ‌టంపై గ‌వ‌ర్న‌ర్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

కాగా, ప‌శ్చిమ‌బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం చోటుచేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా తీవ్రంగా ఖండించారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌గానే బెంగాల్‌లో చెల‌రేగిన హింస త‌మ‌ను దిగ్భ్రాంతికి గురిచేసింద‌ని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌లు త‌మ‌ను చాలా బాధించాయ‌ని చెప్పారు.

ఇలాంటి హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు దేశ విభ‌జ‌న స‌మ‌యంలో మాత్ర‌మే జ‌రిగిన‌ట్లు తాను విన్నాన‌ని జేపీ న‌డ్డా చెప్పారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌గానే ఇలాంటి హింస చెల‌రేగడం స్వాతంత్య్ర భార‌త‌దేశంలో మ‌నం ఎన్న‌డూ చూడ‌లేదని వ్యాఖ్యానించారు. కోల్‌క‌తాలోని బీజేపీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

శాసన సభ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడిన తర్వాత పశ్చిమ బెంగాల్‌లో హింసాకాండ ప్రారంభమైందని బీజేపీ ఆరోపించింది. ఈ హింసాకాండపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీజేపీ నేత గౌరవ్ భాటియా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు