భారత్ కు ఫైజర్‌ రూ 510 కోట్ల సహాయం 

కరోనాతో పోరాడుతున్న భారత్‌కు అండగా నిలిచింది అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్‌. 7 కోట్ల డాలర్ల (సుమారు రూ.510 కోట్లు) విలువైన మందులను ఇండియాకు పంపిస్తోంది. అమెరికాతోపాటు యూరప్‌, ఆసియాలలోని తమ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి ఈ మందులను ఇండియాకు పంపనున్నట్లు ఫైజర్‌ చైర్మన్‌ ఆల్బర్ట్‌ బౌర్లా వెల్లడించారు. 

ఇండియాలో కరోనా పరిస్థితులు మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇండియాలో ప్రజల కోసం మేము ప్రార్థిస్తున్నాం అని ఫైజర్‌ ఇండియాకు పంపిన మెయిల్‌లో ఆల్బర్ట్‌ అని పేర్కొన్నారు.
ఈ పోరాటంలో ఇండియాతో కలిసి సాగుతాం. కంపెనీ చరిత్రలో అతిపెద్దదైన సాయం చేసే దిశగా చాలా వేగంగా పని చేస్తున్నామని ఆయన చెప్పారు.

 భారత ప్రభుత్వం కరోనా చికిత్స కోసం అనుమతించిన మందులను ఫైజర్‌ ఇండియాకు పంపే ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ పేషెంట్‌కు తమ ఫైజర్‌ మందులు ఉచితంగా అందాలన్న ఉద్దేశంతోనే తాము ఈ పని చేస్తున్నట్లు ఆల్బర్ట్‌ తెలిపారు. అవసరమైన వారికి ఆ మందులు అందేలా ప్రభుత్వం, ఎన్జీవోలతో కలిసి పని చేస్తామని చెప్పారు.

కాగా, భారత్‌కు పది లక్షల డోసుల ఆస్ట్రజెనెకా టీకాలను విరాళంగా ఇవ్వాలని స్వీడన్ నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితి చేపట్టిన కోవాక్స్ కార్యక్రమంలో భాగంగా వీటిని పంపిణీ చేస్తారు. పేదదేశాలకు రోనా వ్యాక్సిన్ అందేలా చూసేందుకు సమితి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ టీకాల విరాళం గురించి స్వీడన్ అంతర్జాతీయ సహకార మంత్రి పెర్ ఓల్సన్ ఫ్రిధ్ ఎస్వీటీ ఒక టెలివిజన్ కార్యక్రమంలో ప్రకటించారు.