మేయర్ నుండి ముఖ్యమంత్రి వరకు స్టాలిన్ 

క‌రుణానిధి  కొడుకుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన స్టాలిన్ దశాబ్దాల పాటు తమిళ రాజకీయాలను శాసించిన కరుణానిధి, జయలలిత ( jayalalitha )రణించిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో డీఎంకేను విజయం వైపు నడిపించారు. తొలిసారిగా ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం ఇక లాంఛ‌నమే.

పద్నాలుగేళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన స్టాలిన్‌.. టీనేజీ నుంచే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1976 ఎమర్జెన్సీ టైమ్‌లో జైలు పాలయ్యి అందరి దృష్టినీ ఆకర్షించాడు. 1982లో డీఎంకే యువజన అధ్యక్షుడిగా ఎంపికై పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఇక అప్పటి నుంచి స్టాలిన్‌ వెనుదిరిగి చూసుకోలేదు. 

1984లో చెన్నైలోని థౌజండ్‌ లైట్స్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగినప్పటికీ అందులో ఓడిపోయారు. 1989లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996 నుంచి వ‌రుస‌గా మూడుసార్లు, కొల‌థూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 

1996లో చెన్నై మేయ‌ర్‌గా కూడా స్టాలిన్ ఎన్నిక‌య్యారు. మేయ‌ర్‌గా ఎన్నికైన త‌ర్వాత సిటీ రూపురేఖ‌ల‌నే మార్చేశారు. న‌గ‌ర‌వాసుల‌తో మాన‌గ‌ర తంతై (ఫాద‌ర్ ఆఫ్ సిటీ) అని అనిపించుకున్నారు. 2001లోనూ ఆయ‌న్నే ప్ర‌జ‌లు మేయ‌ర్‌గా ఎన్నుకున్నారు. కానీ అప్పుడు అధికారంలో ఉన్న జ‌య‌ల‌లిత ప్ర‌వేశ‌పెట్టిన మున్సిప‌ల్ యాక్ట్‌తో స్టాలిన్ మేయ‌ర్ ప‌ద‌వి పోగొట్టుకోవాల్సి వ‌చ్చింది. 

2006లో ఎమ్మెల్యేగా గెలిచి.. గ్రామీణ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి అక్క‌డ కూడా త‌న మార్క్ పాల‌న‌ను చూపించారు. సెల్ఫ్‌ గ్రూపులతో గ్రామీణ ప్రజలను అభివృద్ధి దిశగా నడిపించారు. ఇక 2009లో డిప్యూటీ సీఎంగా ఎంపికయ్యారు. 2013లో తన రాజకీయ వారసుడిగా స్టాలిన్‌ను ప్రకటించారు కరుణానిధి. 

అప్పటినుంచి డీఎంకే పార్టీని ముందుండి నడిపించి తండ్రి అందించిన బాధ్యతలను నెరవేర్చుతూ వస్తున్నారు. కాంగ్రెస్‌తో స్నేహం కొనసాగిస్తూ అటు కేంద్రంలో కూడా తన మార్క్‌ రాజకీయాలను స్టాలిన్‌ చూపిస్తూ వస్తున్నారు. 

 ఒక‌వైపు బ‌హిష్కృత నేత‌, త‌న అన్న అళ‌గిరి నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు ఎదుర‌య్యే తిరుగుబాటును స‌మ‌ర్థంగా ఎదుర్కొంటూ.. మ‌రోవైపు అస‌మ్మ‌తి నేత‌ల‌ను బుజ్జ‌గిస్తూ పార్టీని ఒక్క తాటిపై న‌డిపి.. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యానికి కార‌ణ‌మ‌య్యారు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే పార్టీని ఓడించేందుకు అళగిరి  ప్ర‌య‌త్నించాడు. ద‌క్షిణ త‌మిళ‌నాడులో ప‌ట్టు ఎక్కువ‌గా ఉన్న అళ‌గిరి.. డీఎంకే పార్టీ నేత‌ల‌ను ఓడించాల‌ని త‌న అనుచ‌రుల‌కు పిలుపునిచ్చాడు. ఆ ఎన్నిక‌ల్లో డీఎంకే పార్టీ ప‌రాజ‌యం పాలైంది.

ఈ క్ర‌మంలో క‌రుణానిధి మ‌ర‌ణం త‌ర్వాత డీఎంకే పార్టీని చేజిక్కించుకోవాల‌ని అళ‌గిరి ప్ర‌య‌త్నించాడు. కానీ పార్టీ నేత‌ల మ‌ద్ద‌తు స్టాలిన్‌కు ఉండ‌టంతో 2018లో డీఎంకే పార్టీ ప‌గ్గాలు ఆయ‌న‌కే ద‌క్కాయి. దీంతో పార్టీలో చీలిక‌లు తెచ్చేందుకు కూడా ప్ర‌య‌త్నించాడు. పార్టీ సీనియ‌ర్ల‌లో అస‌మ్మ‌తి వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు కూడా చేశారు. 

ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ స్టాలిన్‌ను ఓడించేందుకు అళ‌గిరి ప్ర‌య‌త్నాలు చేశారు. ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో కొత్త పార్టీ పెట్టేందుకు అళ‌గిరి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ప్ర‌చారం కూడా జ‌రిగింది. త‌న అనుచ‌రుల‌తో పాటు డీఎంకేలోని అస‌మ్మ‌తి నేత‌లు ఈ పార్టీ చేరే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఒకానొక స‌మ‌యంలో అళ‌గిరి బీజేపీలో చేర‌తార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

స్టాలిన్ ఎప్ప‌టికీ సీఎం కాలేడ‌ని.. త‌న మ‌ద్ద‌తుదారులు అది జ‌ర‌గ‌నివ్వ‌ర‌ని ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే అళ‌గిరి ప్ర‌య‌త్నాల‌కు త‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో స్టాలిన్ ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ పెట్టుకొచ్చాడు.