ఈటెల మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ 

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్‌ తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. ఆయన నుంచి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను తప్పించిన గంటల వ్యవధిలోనే కేబినెట్‌ నుంచి కూడా బయటికి పంపించారు. ఈటల రాజేందర్‌పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు నిజమేనని అధికారుల నుంచి నివేదిక అందిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మొత్తానికి ఈటల రాజేందర్‌కు సంబంధించిన ‘ఆపరేషన్‌’ కొంచెం అటు, ఇటుగా 48 గంటల్లోనే ముగియడం ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మంత్రి ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలతో శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత అధికార టీఆర్‌ఎస్‌ సొంత టీవీ చానల్‌తోపాటు ప్రభుత్వానికి అనుకూలమనే పేరున్న కొన్ని చానల్స్‌లో కథనాలు ప్రసారమైన విషయం తెలిసిందే. 

అయితే ఇవి ప్రారంభం కావడానికి ముందే బాధిత రైతులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి ఈ వ్యవహారంపై సీఎం విచారణకు ఆదేశించారు. శనివారం ఉదయం 6 గంటలకే మెదక్‌ జిల్లా అచ్చంపేటలో అధికారులు విచారణ ప్రారంభించారు. మంత్రి ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు నిజమేనని ఆ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ మధ్యాహ్నానికి వెల్లడించారు.

ఆ వెంటనే ఈటల రాజేందర్‌ నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను ఆయన నుంచి తప్పించి, ముఖ్యమంత్రికి బదిలీ చేశారు. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్‌ సిఫారసు మేరకు గవర్నర్‌ ఆదేశాలు ఇచ్చారు. సాయంత్రానికి మెదక్‌ జిల్లా కలెక్టర్‌ నుంచి కేసీఆర్‌కు విచారణ నివేదిక అందింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కేబినెట్‌ నుంచి ఈటల బర్తరఫ్‌ అయ్యారు.

‘సీఎం కేసీఆర్‌ సిఫారసు మేరకు మంత్రి ఈటలను కేబినెట్‌ నుంచి గవర్నర్‌ తప్పించారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది’ అని గవర్నర్‌ కార్యదర్శి కె.సురేంద్రమోహన్‌ పేరుతో మీడియాకు ఓ ప్రకటన విడుదలైంది. కాగా, ఈటల రాజేందర్‌ను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేస్తే పార్టీలో ఉత్పన్నమయ్యే పరిస్థితులపై అంచనాకు వచ్చాకే సీఎం పావులు కదిపారని సమాచారం.

మంత్రి ఈటలను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేసే ఫైల్‌ శనివారమే సిద్ధమైనట్లు తెలుస్తోంది. తొలుత ఆయన నుంచి శాఖను తప్పించినప్పటికీ, మంత్రివర్గం నుంచి తొలగించటానికి కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫైల్‌ సిద్ధం చేశారని సమాచారం.

 రాజేందర్‌పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై అధికారుల నివేదిక అధ్యయనం, నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక ఫలితాల వెల్లడి పూర్తయ్యాక కేబినెట్‌ నుంచి ఆయన బర్తర్‌ఫకు సంబంధించిన ఫైల్‌ చకచకా కదిలినట్లు తెలిసింది. ఈ మేరకు మంత్రి ఈటల బర్తరఫ్‌ కానున్నారనే సమాచారం అధికార టీఆర్‌ఎస్‌ ముఖ్యుల్లో ఆదివారం ఉదయం నుంచే చక్కర్లు కొట్టింది.