సొనోవాల్‌-హిమంత బిశ్వ శర్మ జోడీ విజయం 

అసోంలో ఒక కాంగ్రెసేతర పార్టీ వరుసగా రెండోసారి ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా బీజేపీ చరిత్రసృష్టించింది.  పైగా గత ఎన్నికలలోకన్నా తన బలం  పెంచుకోగలిగింది.  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అసోంలో నిరసనలు వెల్లువెత్తినా రాజకీయంగా ఈ అంశం పెద్దగా ప్రభావం చూపకుండా ప్రజలను బిజెపి ఆకట్టుకోగలిగింది. 

సీఏఏ నిరసనలు ఎగిసిపడిన ఎగువ అసోంలో ఎన్డీయే స్వీప్ చేయడంతో కాంగ్రెస్‌ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రాంతంలో సీఏఏ అంశాన్ని ముందుకుతెచ్చినా కాంగ్రెస్‌-ఏఐయూడీఎఫ్‌ కూటమికి మెరుగైన ఫలితాలు రాలేదు. 

మరోవైపు మోరాన్లు, మైసింగ్‌, రభ, దియోరి వంటి భిన్న వర్గాల ప్రజల ఓట్లను కూడగట్టడంలో బీజేపీ విజయం సాధించింది. సీఏఏ అంశంపై అస్సామీలు ఏకం కాకుండా నిరోధించగలిగింది.

కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రభుత్వం, ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ కృషి చేయడం కూడా ఎన్డీయే గెలుపునకు దోహదపడింది. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ తో పాటు రెండు దశాబ్ధాల రాజకీయ అనుభవం కలిగిన హిమంత బిశ్వ శర్మ జోడీ కూడా ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఉపకరించింది. 

ఈ జోడీకి దీటైన ప్రత్యర్ధిని కాంగ్రెస్‌ కూటమి ప్రజల ముందుకు తీసుకురాలేకపోవడం కాంగ్రెస్‌కు మైనస్‌గా మారింది. కాంగ్రెస్‌-ఏఐయూడీఎఫ్‌ కూటమి ముస్లిం ఓట్లను కొంతమేరకు సంఘటితం చేయగలిగినా బీజేపీకి పడే ఓట్లను తమవైపు మళ్లించుకోవడంలో విజయం సాధించలేదు.

కాంగ్రెస్‌ కూటమి దిగువ అసోం, బరక్ లోయల్లో మెరుగ్గానే ఫలితాలు రాబట్టినా ఎగువ అసోంలో పేలవమైన సామర్ధ్యం కనబరించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ దీటుగానే ప్రచారపర్వం సాగించినా సోనోవాల్‌-హిమంతకు దీటైన నాయకత్వాన్ని ప్రజల ముందుకు తేవడంలో విఫలమైంది.

హిమంత బిస్వా శర్మ జలుక్బారి నియోజకవర్గం నుంచి వరుసగా ఐదోసారి గెలుపొందారు. సుమారు లక్షపైగా మెజార్టీని సాధించారు.  ఈ సందర్భంగా హిమంత బిస్వా శర్మ నియోజక వర్గ ప్రజలకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.