భూకబ్జాల్లో 75 మంది టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్యెల్యేలు 

టీఆర్‌ఎస్ కు  చెందిన 75 మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై భూ కబ్జాల ఆరోపణలున్నాయని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.  ఆధారాలతో సహా అన్నీ బయటపెడతామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్చే తగానితనం వల్లే వారు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు. 

మంత్రి ఈటలపై చర్య తీసుకున్నట్లుగానే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను కేబినెట్‌ నుంచి తొలగించాలని, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సంజయ్ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడలేని, ప్రజల ప్రాణాలను రక్షించలేని కేసీఆర్‌ తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

‘111 జీవోను మీ కుటుంబం ఉల్లంఘించలేదా? మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాసగౌడ్, ఎమ్మెల్యేలు వివేకానంద, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సైదిరెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, భాస్కర్‌రావు, రెడ్యానాయక్‌, గొంగిడి సునీత భర్త భూములను కబ్జాలు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి గదా అని ప్రశ్నించారు. వారిపై ఎందుకు విచారణ జరిపించలేదని నిలదీశారు.

ఎమ్మెల్సీ శంభీర్‌పూర్‌రాజు కేసీఆర్‌ కుటుంబానికి బినామీగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఇరిగేషన్‌ శాఖను తన ఆధీనంలో ఉంచుకున్న కేసీఆర్‌ రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని.. ఇప్పుడు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తుండటంతో వైద్య శాఖను తన వద్ద ఉంచుకున్నారని ఆరోపించారు.

ఈటల బీజేపీలో చేరతారా? అన్న ప్రశ్నకు సంజయ్‌ స్పందిస్తూ.. ఈ సమయంలో తాము రాజకీయాలు మాట్లాడబోమని, టీఆర్‌ఎస్ వలె  బీజేపీ మూర్ఖత్వపు పార్టీ కాదని వ్యాఖ్యానించారు.

కాగా, సీఎం కేసీఆర్‌ రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారని ఎంపీ డి అర్వింద్‌ ఆరోపించారు. అత్యంత క్లిష్ట సమయంలో మంత్రి ఈటల మాత్రమే పనిచేస్తున్నారని, సీఎం సహా మంత్రులెవరూ పనిచేయడం లేదని చెప్పారు. ‘ఈటలకు ఒక న్యాయం, భూదాన్‌ భూములు, అటవీ భూములు కబ్జా చేసిన వారికో న్యాయమా?’ అని అర్వింద్‌ ప్రశ్నించారు.