ఒడిశాలో 15 రోజ‌ల పాటు లాక్‌డౌన్‌

క‌రోనా క‌ట్ట‌డికి ఒడిశా ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్రకటించింది. మే 5 నుంచి 15 రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం వెల్ల‌డించింది.  దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాల‌ని నిర్ణ‌యిస్తున్నాయి. 
 
మహారాష్ట్రలో పూర్తి లాక్ డౌన్ విధించ‌గా, కొన్ని రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఒడిశా ప్రభుత్వం  లాక్‌డౌన్    విధిస్తున్న‌ట్లు ప్ర‌కటించింది. మే 5 నుంచి 15 రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 
అయితే లాక్‌డౌన్ సమయంలో అత్యవసరాలకు మాత్రం మినహాయింపు ఉంటుంద‌ని తెలిపింది. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు క‌రోనా నిబంధ‌న‌లు తప్ప‌నిస‌రిగా పాటించాల్సివుంటుంది. వాటిని అతిక్ర‌మిస్తే అధికారులు చ‌ర్య‌లు తీసుకోనున్నారు.  కాగా  ఒడిశాలో 4.62 లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 69,453 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 2068 మంది కరోనా బారినప‌డి మృతి చెందారు.
కాగా, కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వర్కింగ్ జర్నలిస్టులను కొవిడ్ వారియర్స్ గా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నామని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. కరోనా వైరస్ పై వర్కింగ్ జర్నలిస్టులు అవిశ్రాంతంగా సమాచారం చేరవేయడంతో పాటు కొవిడ్-19 సంబంధిత అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారని ప్రశంసించారు.

కొవిడ్19కు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో జర్నలిస్టులు ప్రజలు, ప్రభుత్వానికి విలువైన మద్దతు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి విపత్తు వేళలో జర్నలిస్టులు గొప్ప సేవలు అందిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది.