రిక్షా కార్మికుడి ఇంట్లో భోజనం చేసిన అమిత్ షా

పశ్చిమ బెంగాల్ డోమ్‌జూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం మధ్యాహ్నం రోడ్‌షో నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక రిక్షా కార్మికుడి ఇంట్లో భోజనం చేశారు. ఆ నిరుపేద ఇంట్లో నేలమీద కూర్చునే ఆయన భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 
 
దేశానికే హోం మంత్రి అయిన అమిత్ షా ఒక సామాన్యుడిలా ఆ ఇంట్లోని మహిళలు వండిన అన్నం, పప్పు, కూరలు, సలాడ్‌తో భోజనం చేసి వారి బాగోగులను విచారించారు. అమిత్ షా వెంట డోమ్‌జూర్ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజీబ్ బెనర్జీ, ఇతర నాయకులు ఉన్నారు. 
 
అంతకుముందు, హౌరా జిల్లాలోని డోమ్‌జూర్ పట్టణంలోని ఇరుకు వీధుల్లో అమిత్ షా రోడ్ షో సాగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైన ఈ రోడ్‌షోలో అమిత్ షాతోపాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పాల్గొన్నారు. జగ్‌దీష్‌పూర్ హాట్ నుంచి కోనా క్రాసింగ్ వరకు ఈ రోడ్ షో సాగింది.

ప‌శ్చిమ‌బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఓట‌మి ఖాయ‌మైంద‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా వ్యక్తం చేసారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా హౌరాలోని దొమ్‌జూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన అమిత్ షా.. అక్క‌డి బీజేపీ అభ్య‌ర్థి ర‌జీబ్ బెన‌ర్జీకే ఓటేసి గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. 

నియోజ‌క‌వ‌ర్గంలో తాను ఒకే ఒక గ్రామ పంచాయ‌తీలో ప‌ర్య‌టించాన‌ని, అక్క‌డి ప్ర‌జ‌ల ఉత్సాహం చూస్తుంటే ర‌జీబ్ బెన‌ర్జీకి భారీ మెజారిటీ ఖాయ‌మ‌నిపిస్తున్న‌ద‌ని చెప్పారు. వ‌చ్చే నెల 2న బెంగాల్‌లో బీజేపీ 200కుపైగా సీట్ల‌ను సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఖాయ‌మ‌ని అమిత్ షా ధీమా వ్య‌క్తంచేశారు.  మ‌మ‌తాబెన‌ర్జి ప్ర‌సంగాలు, ప్ర‌వ‌ర్త‌న‌లో ఓట‌మి తాలూకూ ఫ్ర‌స్టేష‌న్ క‌నిపిస్తున్న‌ద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.