అంబానీ ఇంటివద్ద `పేలుడు’ వాహనం వెనుక తీహార్ ఉగ్రవాది!

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటివద్ద కలకలం రేపిన పేలుడు పదార్ధాలతో కూడిన వాహనంకు మూలం తీహార్ జైలులోని ఒక ఉగ్రవాది వద్ద దర్యాప్తు సంస్థలకు బైటపడింది

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలతో కూడిన వాహనాన్ని నిలిపింది తామే అంటూ ఓ ఉగ్రవాద సంస్థ  గతంలో ప్రకటించుకుంది. జైషే ఉల్‌ హింద్‌ ఉగ్రవాద సంస్థ టెలిగ్రాం వేదికగా గత నెల 27న ఈ ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఆధారంగా దరీఫతు జరిపితే తీహార్ జైలు నుండే ఆ ప్రకటన వెలువడినట్లు వెల్లడైనది.

ఈ టెలిగ్రామ్ సందేశం నకిలీ అంటూ ముంబై పోలీసులు పైకి  కొట్టిపారవేసినా, సీరియస్‌గా తీసుకున్న అధికారులు లోతుగా దర్యాప్తు చేయగా తీహార్ జైలులో ఉన్న ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాది తెహిసీన్ అఖ్తర్ నుండే ఈ సందేశం వచ్చిన్నట్లు నిర్ధారించారు.  

తెహిసీన్‌ అఖ్తర్‌ ను 2014, నరేంద్ర మోదీ ర్యాలీ సందర్భంగా పాట్నాలో సీరియల్‌ బ్లాస్ట్‌లకు ప్లాన్‌ చేసినందుకు గాను ఇతడిని అరెస్ట్‌ చేశారు. అఖ్తర్‌కు గతంలో హైదరాబాద్‌, బోధ్‌గయాలో జరిగిన పేలుళ్లతో కూడా సంబంధం ఉంది. 

‘‘టెలిగ్రాం మెసేజ్‌ ఆధారంగా ముంబై పోలీసులు ఓ ప్రైవేట్‌ సైబర్‌ ఏజెన్సీ సాయంతో లోకేషన్‌ని ట్రేస్‌‌ చేయగా.. తీహార్‌ జైలు వెలుగులోకి వచ్చింది. దాంతో ఢిల్లీ పోలీసులు అక్కడకు చేరుకున్నారు” అని డిప్యూటి కమిషనర్‌ ప్రమోద్‌ సింగ్‌ చెప్పారు. 

స్పెషల్‌ సెల్‌ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు తీహార్‌ జైలు అధికారులు సోదాలు నిర్వహించగా  తెహిసీన్ అఖ్తర్ సహా అల్‌ఖైదాతో సంబంధాలున్నవారు, అండర్‌వరల్డ్ డాన్‌లు ఉంటున్న బ్యారక్‌లో మొబైల్ ఫోన్‌ ఉన్నట్లు తెలిసింది. దీన్ని ఉగ్రవాది అఖ్తర్ నుంచి స్వాధీనం చేసుకోవడంతో ప్రస్తుతం అతడినే అనుమానిస్తున్నామని వెల్లడించారు. 

ఈ క్రమంలో తీహార్‌ జైలులో కనీసం 11 మంది జైలు ఖైదీలను ప్రశ్నించినట్టు జైలు వర్గాలు పేర్కొన్నాయి. ఈ మొబైల్‌ నంబరు వినియోగదారు టెలిగ్రామ్ ఖాతాను సృష్టించడానికి వర్చువల్ నంబర్లను వినియోగించాడు.. అంతేకాకుండా, అనుమానితుడు నెట్‌లో ఐపీ అడ్రస్‌ను గుర్తించకుండా ఉండేందుకు టీఓఆర్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

ముంబై పోలీసులు నియమించిన సైబర్ నిపుణులు టెలిగ్రామ్ ఛానల్ గురించి సమాచారం పొందడానికి ట్రోజన్లను ఉపయోగించారు. ఇది ఫిబ్రవరి 26 మధ్యాహ్నం ఈ టెలిగ్రాం గ్రూప్‌ను క్రియేట్ చేసినట్టు కనుగొన్నారు.