పోంజీ స్కాంలో బెంగాల్ మంత్రికి సీబీఐ సమన్లు

తృణమూల్ కాంగ్రెస్ సెక్రటరీ జనరల్, పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ చటర్జీకి సీబీఐ ఇవాళ సమన్లు జారీ చేసింది. ఐ-కోర్ పోంజి స్కామ్‌ కేసులో ఆయనను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. వచ్చే వారంలోగా కోల్‌కతా సీజీవో కాంప్లెక్స్‌లోని సీబీఐ కార్యాయాలనికి రావాలని సీబీఐ ఆదేశించినట్టు సమాచారం. 
 
ఐ-కోర్ కంపెనీ ఏర్పాటు చేసిన పలు కార్యాక్రమాలకు పార్థ చటర్జీ హాజరైనట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో రిటర్నులు వస్తాయంటూ ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున సొమ్ములు వసూలు చేసి మోసిగించినట్టు ఐ-కోర్ మీద ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని మంత్రి పార్థ చటర్జీ పేర్కొన్నారు. 
 
‘‘నన్ను పిలిస్తే, తప్పకుండా వెళ్తాను. ఓ మంత్రిగా నేను ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనవచ్చు. రాజకీయాల్లోకి చేరేందుకు నేను ఎంతో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టా వచ్చానన్న సంగతి గుర్తుచేసుకుంటే మంచిది. ధనం మీద నాకు ఎలాంటి వ్యామోహమూ లేదు…’’ అని పేర్కొన్నారు. 
 
శారద, రోజ్‌వ్యాలీ చిట్ ఫండ్ కంపెనీల మాదిరిగానే.. ఐ-కోర్ కూడా అనేక తప్పుడు పథకాలు ప్రచారం చేసి ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి మోసగించినట్టు ఆరోపణలు ఉన్నాయి.