మళ్లీ రెండంకెల వృద్ధి లోకి దేశ జీడీపీ 

ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటుండటం, మదుపరుల పెట్టుబడులు తిరిగి పుంజుకుంటుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరాని (2021-22)కల్లా దేశ జీడీపీ రెండంకెల వృద్ధిని అందుకునే అవకాశాలున్నాయని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది మార్చి ఆఖరుతో ముగిసే సంవత్సరానికిగాను భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 11 శాతంపైనే నమోదు కావచ్చని ఓ తాజా నివేదికలో పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు సంజయ్‌ అగర్వాల్‌ అంచనా వేశారు. 

కరోనా వైరస్‌ దెబ్బకు దేశ జీడీపీ మైనస్‌లోకి జారుకున్న విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి త్రైమాసికంలో మైనస్‌ 24.4 శాతంగా ఉన్న జీడీపీ.. రెండో త్రైమాసికంలో మైనస్‌ 7.3 శాతంగా ఉన్నది. అయితే మూడో త్రైమాసికంలో 0.4 శాతం మేర స్వల్ప వృద్ధిని చూసిన సంగతి విదితమే.

గడిచిన 11 నెలలుగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నాయని అగర్వాల్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గతేడాది ఫిబ్రవరిలో పీహెచ్‌డీసీసీఐ ఎకానమీ జీపీఎస్‌ సూచీ 103 పాయింట్లతో ఉందని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అది 19 పాయింట్లు పెరిగిందని తెలిపారు. కాగా, ఈ 2020-21 ఏప్రిల్‌-ఫిబ్రవరిలో జీపీఎస్‌ సూచీ 92.4 శాతంగా ఉందని, 2019-20 ఇదే వ్యవధిలో 99.5 శాతంగా ఉందని చెప్పా రు. రాబోయే 2021-22లో సూచీ మరింత మెరుగ్గా ఉండగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

మరోవంక, 2022దాకా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కరోనాకు ముం దున్న స్థితికి బలపడకపోవచ్చని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ గురువారం అభిప్రాయపడింది. కరోనా వైరస్‌ విజృంభణను అడ్డుకునేందుకు భారత్‌సహా చాలా దేశాలు గతేడాది మార్చి నుంచి లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చినది తెలిసిందే. ఇది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల్ని, యావత్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే స్తంభింపజేసింది.

ఉత్పత్తి నిలిచిపోగా, మార్కెట్‌ మూతబడి కొనుగోళ్లూ మందగించాయి. దీంతో స్థూల ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉందని మూడీస్‌ వెల్లడించింది.