భైంసాలో భరోసా యాత్ర చేస్తా

సీఎం కేసీఆర్ భైంసాలో పర్యటించి అల్లర్లలో గాయపడిన వారిని పరామర్శించకపోతే తానే భైంసాలో భరోసా యాత్ర చేస్తానని బీజేపీ ఎంపీ బండి సంజయ్ హెచ్చరించారు. భైంసాలో ఎంఐఎం గూండాల దాడిలో గాయపడి.. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన బుధవారం పరామర్శించారు. భైంసా ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

‘భైంసా బాధితుల పరిస్థితి హృదయవిదారకరం. బాధితులకు అందుతున్న చికిత్స గురించి ఆస్పత్రి వర్గాలతో చర్చించాను. ముఖ్యమంత్రి కేసీఆర్ భైంసాలో హింసోన్మాదం సృష్టించిన ఎంఐఎంకు కొమ్ముకాస్తున్నడు. కనీసం ప్రభుత్వం తరఫున ఏ ఒక్కరూ కూడా బాధితులను పరామర్శించకపోవడం సిగ్గుచేటు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఒక వర్గానికి కొమ్ముకాస్తూ, ఓటుబ్యాంకు రాజకీయం చేస్తూ హిందువులపై దాడులను ప్రోత్సహించడం దుర్మార్గం అని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా..? అని ప్రశ్నించారు. బైంసా ఘటన పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని స్పష్టం చేశారు. 

బిజెపి స్పందించడం వల్లే బాధితులకు ప్రాణాపాయం తప్పిందని సంజయ్ తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఎవరూ స్పందించలేదని ప్రశ్నించారు. జర్నలిస్టులు  విజయ్, దేవారెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెబుతూ భైంసాలో ప్రత్యేక చట్టం ఏదైనా అమలు చేస్తున్నారా?  అని విస్మయం వ్యక్తం చేశారు. 

పేదల ఇళ్ళు దగ్ధం చేసినా సీఎం స్పందించలేదని అంటూ ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారని గుర్తు చేశారు. ఇవన్నీ ఒక పథకం ప్రకారమే చేశారని అంటూ అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కొన్నింటికి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. భైంసాలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
ఇలా ఉండగా, బైంసా ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీ మహేందర్ రెడ్డిని బీజేపీ నేతలు కోరారు. ఈ రోజు డీజీపీని కలిసి బైంసా ఘటనపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ బైంసా ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరామనితెలిపారు. 
బైంసా బాధితులకు పోలీసులు న్యాయం చేస్తారన్న నమ్మకం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులపై టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దాడి చేసింది ముస్లింలు అయితే, హిందువులను అరెస్టులు చేయటం అన్యాయమని ఆయన మండిపడ్డారు. 
తెలంగాణలో కావాల్సిన దానికంటే ఎక్కువ లౌకికవాదం అమలవుతోందని అరవింద్ ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పౌర సమాజం పట్ల ఎలా వ్యవహరించాలో ఓవైసీ సోదరులకు నేర్పిస్తామని ఎంపీ  అరవింద్ తెలిపారు. డీజీపీని కలిసిన వారిలో ఎంపీలు సోయం, ధర్మపురి అరవింద్, రాజాసింగ్, వివేక్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.