ఉత్తరాఖండ్ సీఎంగా తీరథ్ సింగ్ రావత్

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరథ్ సింగ్ రావత్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బేబి రాణి మౌర్య ఆయనతో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు.  ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ ప్రజానీకాన్ని విశ్వాసాన్ని చూరగొంటూ, ముందుకు సాగుతానని ఆయన ప్రకటించారు. 

మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఏ పనులనైతే చేశారో… వాటిని కొనసాగిస్తానని ఈ సందర్భంగా కొత్త ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ చేపట్టిన రోడ్ ప్రాజెక్ట్, హృషీకేశ్ రైల్వే ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

 ‘‘మాజీ ప్రధాని వాజ్‌పాయ్‌తో కలిసి కార్యకర్తగా పనిచేశా. మాతో కలిసి, కింద కూర్చొని వాజ్‌పాయ్ భోజనం చేశారు. రైల్ ప్రయాణం కూడా చేశాం. ఇవన్నీ నాకు ప్రేరణనిస్తాయి. అందర్నీ కలుపుకునే ముందుకు వెళ్తా. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అదే నేర్పించింది. అదే నాకు ప్రేరణ.’’ అని తీరథ్ సింగ్ రావత్ పేర్కొన్నారు. 

‘‘ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తీరథ్ సింగ్ రావత్‌కు శుభాకాంక్షలు. పరిపాలనా అనుభవం మెండుగా ఉన్నవారు. క్షేత్ర స్థాయిలో పూర్తి పట్టున్నవారు. ఆయన సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆశిస్తున్నాం.’’ అని మోదీ ట్వీట్ చేశారు.