కేరళ నేత  పీసీ చాకో కాంగ్రెస్‌కు రాజీనామా  

కేరళ ఎన్నికలు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పీసీ చాకో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్టు తెలిపారు. పార్టీలో వర్గ విభేదాలు, నాయకత్వ లేమి ఉందని ఈ సందర్భంగా అయన ధ్వజమెత్తారు.

పార్టీలో కొనసాగలేని పరిస్థితి వల్లే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఏడాదికి పైగా పార్టీకి అధ్యక్షుడే లేడని, కొత్త అధ్యక్షుడిని తీసుకు వచ్చే ప్రయత్నాలు కూడా జరగలేదని, తలలేని పార్టీగా పనితీరు ఉందని చాకో విమర్శించారు. రాహుల్‌తో సహా పార్టీ అధిష్ఠానాన్ని ఎవరూ ప్రశ్నించే పరిస్థితి లేదని దయ్యబట్టారు.

కేరళ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు తారస్థాయికి చేరాయని పిసి చాకో తెలిపారు. కేరళలో కాంగ్రెస్ (ఐ), కాంగ్రెస్(ఏ) గ్రూపులున్నాయన్న ఆయన గ్రూపు రాజకీయాలపై అధిష్ఠానం దృష్టికి తెచ్చినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ గ్రూప్ రాజకీయాలను అధిష్ఠానం నియంత్రించలేదని, గ్రూప్ రాజకీయాలకు అధిష్ఠానం మౌనసాక్షిగా మారిందని ఆరోపించారు.

గ్రూపు రాజకీయాలతో విసుగెత్తి రాజీనామా చేస్తున్నానని చాకో వెల్లడించారు. ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకొంటున్నా వాస్తవానికి కేరళలో కాంగ్రెస్ అనేదే లేకుండా పోయిందని పేర్కొన్నారు. ‘ఈ విషయం పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా విఫలమయ్యానని చెప్పారు. కేరళలో కాంగ్రెస్ రోజురోజుకూ కనుమరుగవుతోందని, ఇందుకు నిరసనగానే తాను పార్టీకి రాజీనామా ఇచ్చానని వెల్లడించారు.

కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం అనేది మిగలలేదని కూడా ఆయన వాపోయారు. అభ్యర్థుల జాబితాపై రాష్ట్ర కాంగ్రెస్ కమిటీతో చర్చించలేదని తెలిపారు. అయితే కేరళలో బీజేపీ పెద్దగా లబ్ధి పొందేది ఏమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.  కాగా, విద్యార్థి నేతగా కెరీర్‌ ప్రారంభించిన చాకో కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. ఏఐసీసీ స్థాయికి ఎదిగారు. కేరళ మంత్రిగా పని చేశారు. మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.