అమిత్‌షాను ప్రశంసల్లో ముంచెత్తిన అరవింద్‌ కేజ్రీవాల్‌

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశంసల్లో ముంచెత్తారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో అమిత్‌షా సేవలు అనిర్వచనీయమైనవని పొగడ్తల్లో ముంచెత్తారు. 

ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ మూడవ రోజు బుధవారం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో కరోనా శకం చాలా కష్టమైన సమయం అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా గొప్ప సేవలు అందించారని, ఆయన సేవలు అనిర్వచనీయమైనవని చెప్పారు. 

కరోనా వ్యాప్తి సమయంలో రాజధాని నగరంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రజలతో కలిసి మంచిగా పనిచేయడానికి ప్రయత్నించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగానైనా సేవ చేయగలదని, తమ ప్రభుత్వం అదే చేసిందని ఆయన చెప్పారు. 

ఈ సమయంలో అందరూ మంచి పని చేశారని అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మెరుగైన సేవలందించారని అరవింద్ కేజ్రీవాల్ కొనియాడారు. ఢిల్లీలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసుల మధ్య అమిత్ షా వేగంగా సమావేశాలు నిర్వహించడం ద్వారా అనేక ముఖ్యమైన చర్యలు తీసుకున్నారని తెలిపారు. 

అనంతర కాలంలో కరోనా కేసులు కూడా తగ్గాయని చెప్పారు. ఇదే సమయంలో ఆయన ప్రతిపక్షాలను కూడా ప్రశంసించారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మెరుగైన పని చేశారని కేజ్రీవాల్ అభినందించారు. ఈ సంక్షోభం ఏ ఒక్క ప్రభుత్వానికి సంబంధించినది కాదని, వైద్యులు అందరికన్నా ఉత్తమమైన సేవలందించారని కొనియాడారు.