కరోనాపై పోరులో ముందున్న భారత్

కరోనా మహమ్మారితో పోరాటంలో భారత్ ముందుంటోందని, నిజంగా వ్యాక్సిన్ విధానానికి అక్షరాలా కట్టుబడి ఉందని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాధ్ ప్రశంసించారు. కరోనా సంక్షోభంలో వ్యాక్సిన్లు తయారు చేసి అనేక దేశాలకు సరఫరా చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తోందని ఆమె కొనియాడారు. 
 
ప్రపంచం మొత్తం మీద వ్యాక్సిన్ల తయారీ హబ్ భారతేనని ఆమె  అభివర్ణించారు. బంగ్లాదేశ్ నేపాల్, మయన్మార్ వంటి పొరుగు దేశాలకు గ్రాంట్స్ ద్వారా వ్యాక్సిన్ సరఫరా చేయగలిగిందని ఆమె పేర్కొన్నారు. కరోనా వల్ల భారత్ బాగా దెబ్బతిన్నదని, 2020 లో సాధించిన 8 శాతానికి వ్యతిరేకంగా చాలా కష్టంగా జిడిపి 6 శాతం సాధించ గలిగిందని చెప్పారు. కరోనా సంక్షోభం ఉన్నా సరే 2021 లో 11.5 శాతం వంతున డబుల్ డిజిట్ సాధిస్తున్నట్టు ఐఎంఎఫ్ వెల్లడించింది.

ఇలా ఉండగా, కరోనా నివారణకు స్వదేశీయంగా భారత్‌లో తయారైన మొదటి వ్యాక్సిన్ కొవాగ్జిన్ ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా రోగులకు రక్షణ కల్పించడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపిస్తుందని లాన్సెట్ ఇన్‌పెక్సియస్ డిసీజెస్ జర్నల్ వెల్లడించింది. 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసిఎంఆర్), పుణె కేంద్రమైన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) సహకారంతో భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. భారత్ ఔషధ నియంత్రణ మండలి దీన్ని అత్యవసర వినియోగానికి అనుమతించడంతో మొదట నిపుణులు అభ్యంతరాలు తెలియచేశారు.

అయితే మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ 81 శాతం సమర్థత చూపిస్తోందని భారత్ బయోటెక్ ప్రకటించిన వారం తరువాత ఈ తాజా అధ్యయనం వెలుగు లోకి వచ్చింది. ఈ ఫలితాలు ఇంకా ప్రచురణ కావలసి ఉంది. రెండో దశ ట్రయల్ దేశం లోని తొమ్మిది రాస్ట్రాలోని 9 ఆస్పత్రుల్లో 12 నుంచి 65 ఏళ్ల వారిపై నిర్వహించారు.