భైంసా అల్లర్లపై అమిత్‌ షా ఆరా

భైంసాలో జరిగిన అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరా తీశారు. తాజా పరిస్థితిపై ఆయన హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డితో, డీజేపీ మహేందర్‌రెడ్డితో ఫోన్‌లో సమీక్షించారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని కిషన్‌రెడ్డి  అమిత్‌ షాకు తెలిపారు.

కాగా, భైంసా అల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. కేసీఆర్‌ సర్కారు ఒక వర్గానికి కొమ్ముకాయడం వల్లే భైంసాలో తరచూ అల్లర్లు జరుగుతున్నాయని మండిపడ్డారు. అది భైంసానా? పాకిస్తానా? అని నిలదీశారు.

అల్లర్లలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టులు విజయ్‌, దేవారెడ్డిలను బిజెపి ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్‌లు పరామర్శించారు. అర్వింద్‌ విలేకరులతో మాట్లాడుతూ మజ్లిస్‌ నాయకుడు జామీర్‌ అహ్మద్  భైంసాను ముస్లిం పట్టణంగా మార్చాలనే దాడులకు ఉసిగొల్పుతున్నాడని ఆరోపించారు. 

కాగా, రాష్ట్రంలో రోజురోజుకూ జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ జర్నలిస్టు యూనియన్‌ (టీజేయూ) ఆరోపించింది. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. పట్టణంలో సాయుధ బలగాలను మోహరించామన్నారు. ముందుజాగ్రత్త చర్యగా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నామని చెప్పారు. అల్లర్లపై డీజీపీ మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో మాట్లాడి వివరాలు సేకరించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. 

ద్విచక్ర వాహనం విషయంలో ఇద్దరు యువకుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ  హింసకు దారి తీసిందని ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. హింసకు పాల్పడ్డ వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దాడులతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై పీడీ యాక్ట్‌, బహిష్కరణ వేటు వేస్తామని ఐజీ తెలిపారు.

 ఆదివారం రాత్రి 8.45 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనం విషయంలో ఇద్దరు యువకుల నడుమ జుల్ఫికర్‌ వీధిలో వివాదం చోటుచేసుకుందని, నిమిషాల్లోనే పెద్దదిగా మారిందని నాగిరెడ్డి వివరించారు. ఎస్పీ విష్ణు వారియర్‌ అదనపు బలగాలతో అక్కడికి చేరుకుని రాత్రి 10.30 గంటల్లోపు పరిస్థితి అదుపులోకి తెచ్చారన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ఐజీ చెప్పారు. 

సీసీ ఫుటేజీల్ని పరిశీలిస్తున్నామని, అన్ని సాంకేతిక ఆధారాలతో బాధ్యులందరిపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఐజీ వెల్లడించారు. వదంతులు వ్యాపించకుండా చూసేందుకు భైంసాలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. సోమవారం పట్టణంలో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ పర్యటించారు. 

అల్లర్ల ఘటనలకు సంబంధించి పలువురు అనుమానితులను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి 40మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వీరితో పాటు గతంలో అల్లర్లలో పాల్గొన్న వారినీ అదుపులోకి తీసుకున్నారు. 

కాగా, అల్లర్లలో తీవ్ర గాయాలపాలైన ఓ చానెల్‌ రిపోర్టర్‌ విజయ్‌, దేవారెడ్డిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. స్వల్ప గాయాలైన ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి ప్రభాకర్‌ ప్రస్తుతం భైంసాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.