మహిళా రిజర్వేషన్‌పై దద్దరిల్లిన రాజ్యసభ 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 33 శాతం మహిళా రిజర్వేషన్‌పై రాజ్యసభ దద్దరిల్లింది. ఈ బిల్లు ప్రతిపాదించి 24 ఏళ్లు అయినప్పటికీ ముందుకు కదలకపోవడంపై ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం నాటి పార్లమెంట్ సమావేశంలో మహిళా ఎంపీలు మాట్లాడడానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించగా పలువురు మహిళా ఎంపీలు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్‌ను ప్రస్తావించారు. దశాబ్దాలు గడిచినా బిల్లు పార్లమెంట్ గుమ్మం దాటకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘దేశ రాజకీయాల్లో మహిళా ప్రాధాన్యత ఇప్పటికీ చాలా తక్కువగానే ఉంది. 6 శాతానికి మించి రాజకీయాల్లో మహిళలు లేరని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. మనం దీని గురించి తీవ్రంగా ఆలోచించాలి” అని కాంగ్రెస్ నేత ఫౌజియా ఖాన్ రాజ్యసభలో కోరారు. 

భారత రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత పెంచాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టంగా మార్చాలని ఆమె స్పష్టం చేశారు. లోక్‌సభ, రాజ్యసభలతో పాటు దేశంలోని అన్ని చట్టసభలు దీనిపై వీలైనంత తొందరలో విస్తృత చర్చ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ ‘‘24 ఏళ్ల క్రితం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల విషయాన్ని ప్రతిపాదించారు. 24 ఏళ్ల తర్వాత ఇది మరోసారి చర్చకు వచ్చింది. మేం ఈ దేశ జనాభాలో సగం. అన్నింటా మేము సమంగానే ఉంటాం. ఈ బిల్లును 33 శాతం నుంచి 50 శాతం రిజర్వేషన్‌గా మార్చి పార్లమెంట్‌లో ఆమోదింపజేయాలి’’ అని స్పష్టం చేశారు. 

‘‘చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం` బేటి పడావో ‘గురించి మాట్లాడుతోంది, కాని కుమార్తెల పరిస్థితి ఏంటని మాత్రం ఆలోచించడం లేదు’’ అని మరో ఎంపీ ఛాయా వర్మ విచారం వ్యక్తం చేశారు. 

రాజ్యాంగ 108వ సవరణ ద్వారా మహిళల రిజర్వేషన్ బిల్లు-2008ను తీసుకువచ్చారు. మార్చి 9, 2010 న రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించింది. అయితే లోక్‌సభలో మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉంది.