టీఆర్‌ఎస్‌ గెలిస్తే ఉద్యోగులు పీఆర్సీ మరచిపోవాల్సిందే

టీఆర్‌ఎస్‌ గెలిస్తే ఉద్యోగులు పీఆర్సీ, నిరుద్యోగులు నోటిఫికేషన్ల మాట మరచిపోవాల్సిందేనని, ఆర్టీసీ, ప్రభుత్వ ఉద్యోగుల బతుకులు అధ్వానం గా మారుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాచారం, రామంతాపూర్‌లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ  బీజేపీ పోరాటం చేసిన తర్వాతనే ఉద్యోగుల పీఆర్సీపై సీఎం కేసీఆర్‌ మాట్లాడారు తప్ప, అప్పటిదాకా నోరు మెదపలేదని గుర్తు చేశారు. 

రాష్ట్రానికి 13 వేల కంపెనీలు తెచ్చామని, 25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని.. ఇలా అనేక అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలుపొందాలని టీఆర్‌ఎస్‌ విశ్వప్రయత్నాలు చేస్తోందని విమర్సించారు. కానీ ప్రజల అండదండలు, సర్వేలు బీజేపీకే అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే రెండు స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. 

కేంద్రం ఇచ్చిన నిధులను సీఎం కేసీఆర్‌ దారి మళ్లిస్తున్నారని, ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు జుర్రుకుంటన్నారని సంజయ్  ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌, కాంగ్రెస్‌ డ్రామాలు సాగవని, టీఆర్‌ఎ్‌సకు ఇక వీఆర్‌ఎస్‌ తప్పదని స్పష్టం చేశారు.

ఇలా ఉండగా, మంత్రి కేటీఆర్‌పై ఆయన కుటుంబసభ్యులు వివక్ష చూపుతుంటే, కేంద్రాన్ని నిందించడం తగదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  హితవు చెప్పారు. కేంద్రం దక్షిణాది ప్రాంతాలపై వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి స్పందించారు. కేటీఆర్‌పై కుటుంబ సభ్యులకు వివక్ష ఉంటే ఆయన ఇంట్లో తేల్చుకోవాలని హితవు చెప్పారు. ఐటీఐఆర్‌కు ఎమ్మెల్సీ ఎన్నికలకు సబంధం లేదని స్పష్టం చేశారు.

ఉద్యోగులకు పదోన్నతులు, ఫిట్‌మెంట్‌ ఇవ్వడం చేతకాని ప్రభుత్వం వారిపై బెదిరింపులకు పాల్పడుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే ఉస్మానియా వర్సిటీలో ప్రచారం చేయాలని సవాల్‌ చేశారు.