లక్ష కోట్ల రూ పైగా ఏపీ ప్రభుత్వ కార్పొరేషన్ల అప్పులు!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తన రోజువారీ అవసరాలకోసం కూడా అప్పు చేయనిదే గడవని పరిస్థితులలో ఉండగా, ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ కార్పొరేషన్లు సహితం పెద్ద ఎత్తున అప్పులు చేస్తుండటం, ఆ మొత్తాలను ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకోవడం రివాజుగా మారుతున్నది. ఆ విధంగా ప్రభుత్వ కార్పొరేషన్లు లక్ష కోట్లకు పైగా అప్పులలో కూరుకు పోయినట్లు చెబుతున్నారు. 
 
ఇప్పటికే పలు సంస్థలను డిఫాల్టర్లుగా బ్యాంకులు ప్రకటిస్తుండగా, ఇదే పరిస్థితి కొనసాగితే మరికొన్ని సంస్థలపై కూడా త్వరలోనే డిఫాల్టర్‌ ముద్ర పడే ప్రమాదం ఉందన్న భావాన్ని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత తెలుగుదేశం హయాం నుంచి సంస్థల తరఫున రుణాలు తీసుకోవడం, వాటిని ఇతర అవసరాలకు వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది.
వైసిపి ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తోంది. సంస్థల రుణాల కోసం బ్యాంకులకు గ్యారెంటీ ఇవ్వడం, రుణం వచ్చిన తరువాత వాటిని పీడీ ఖాతాల ద్వారా వాడుకోవడం జరుగుతున్నట్లు అధికారులే చెబుతున్నారు. ఇలా తీసుకున్న రుణాలు దాదాపు రూ.లక్ష కోట్ల వరకు ఉంటాయి.
 ఇందులో 70 శాతం వరకు పీడీ ఖాతాల ద్వారా ప్రభుత్వం వాడుకున్నవే ఉన్నట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి బ్యాంకుల నుంచి సంస్థలు రుణం తీసుకున్న సమయంలోనే అవి ఏ రంగానికి ఉపయోగించాలన్నది నిర్ధిష్టంగా ఒప్పందంలో ఉంటుంది. అందుకే వాటిని వేరే అవసరాలకు వినియోగించడం సాధ్యం కాదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేరద్రనాథ్‌రెడ్డి చెబుతున్నప్పటికీ, లోపాయికారిగా బదలాయింపులు జరుగుతున్నట్లు అధికారులు అంగీకరిస్తున్నారు.
ఈ రుణాలను తిరిగి చెల్లించాల్సిన సమయంలో సంస్థల వద్ద నగదు అందుబాటులో లేకపోవడం, ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడం వంటి కారణాలతోనే సంస్థలు రుణగ్రస్తులుగా మారిపోతున్నాయని, చివరకు డిఫాల్టర్ల స్థాయికి చేరిపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.