తమిళనాడులో రాబోయేది బీజేపీ-ఏఐఏడీఎంకే ప్రభుత్వమే

తమిళనాడులో రాబోయేది బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమి ప్రభుత్వమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 6న జరిగే శాసన సభ ఎన్నికల్లో ప్రజలు తమ కూటమికి గట్టి మద్దతు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. ఈ కూటమి గెలుపు కోసం ఆదివారం ఆయన కన్యాకుమారి జిల్లాలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అమిత్ షా ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానికులతో మాట్లాడారు. వారికి బీజేపీ ఎన్నికల ప్రచార కరపత్రాలను అందజేశారు.

కన్యా కుమారి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా  మాజీ కేంద్ర మంత్రి పోన్ రాధాకృష్ణన్ పోటీ చేస్తారు. అమిత్ షాతోపాటు పోన్ రాధాకృష్ణన్ కూడా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. రాధాకృష్ణన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని అమిత్ షా ప్రజలను కోరారు. ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ఇక్కడి నుంచి బీజేపీ లోక్‌సభ సభ్యుడిని పంపించడం చాలా ముఖ్యమని చెప్పారు. 

ప్రధాన మంత్రి మోదీ సందేశాన్ని ప్రజలకు అందించడం కోసం ఇంటింటికి వెడుతున్నామని చెబుతూ వారి స్పందన చాలా ఉత్సాహంగా ఉన్నదని తెలిపారు. శాసన సభ ఎన్నికల్లో బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమిని భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు. అంతకుముందు ఆయన సుచీంద్రంలోని శ్రీ తనుమలయన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

 అన్నాడీఎంకే,బిజెపిల మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు ప్రకారం బిజెపి తమిళనాడులో 20 అసెంబ్లీ సీట్లతో పాటు కన్యాకుమారి లోక్ సభ ఉపఎన్నికలలో పోటీ చేస్తుంది. ఇక్కడి నుండి రాధాకృష్ణన్ 2014లో  గెలుపొందగా, 2019లో ఆయన ఓటమి చెందారు.