బెంగాలీ నటులు దేబశ్రీ, రాహుల్ బీజేపీలో

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీలోకి ప్రముఖుల చేరికలు పెరుగుతున్నాయి. తాజాగా బెంగాలీ నటులు రాహుల్ చక్రవర్తి, దేవశ్రీ భట్టాచార్య ఆ పార్టీలో చేరారు. బెంగాల్ బీజేపీ శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో వీరు ఆ పార్టీలో చేరారు.

టీఎంసీ మాజీ ఎమ్మెల్యే దీపాలీ సాహా, టీఎంసీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కనిష్క మజుందార్, టీఎంసీ యువజన నేతలు సౌరవ్ రాయ్‌ చౌదరి, సాయన్ ముఖర్జీ, శుభంకర్ కూడా  ఈ  సందర్భంగా బీజేపీలో చేరారు. వీరితోపాటు గుర్ బంగా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ గోపాల్ చంద్ర కృష్ణ, మరికొందరు ఆ పార్టీలో చేరారు. 

రాహుల్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ, తాను క్రమశిక్షణగల వ్యక్తినని, బీజేపీ క్రమశిక్షణగల పార్టీ అని తెలిపారు. బీజేపీలో చేరాలనే నిర్ణయాన్ని గతంలోనే తీసుకున్నానని, అయితే సరైన సమయం కోసం వేచి చూశానని చెప్పారు.  తాను పని చేయడానికి వచ్చానని, సీనియర్లు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. బీజేపీ, టీఎంసీలలో సెలబ్రిటీలు చేరుతుండటం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, చాలా పెద్ద తార నరేంద్ర మోదీ అని రాహుల్ చెప్పారు.

దేవశ్రీ భట్టాచార్య మీడియాతో మాట్లాడుతూ, స్వచ్ఛమైన పశ్చిమ బెంగాల్ సాధన కోసం తాను బీజేపీలో చేరానని చెప్పారు. బీజేపీ అతి పెద్ద పార్టీ అని, అందుకే ఆ పార్టీతో చేతులు కలిపానని తెలిపారు. తనకు టీఎంసీలో సరైన గౌరవం దక్కలేదని,  టిఎంసీలో అవినీతి పెరిగిందని ఆమె ధ్వజమెత్తారు. బీజేపీ స్వచ్ఛమైన పార్టీ అని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ కలలుగంటున్న బంగారు బెంగాల్ సాధన కోసం బీజేపీలో చేరానని తెలిపారు.

 కాగా, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే తొలి, రెండవ విడత అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. 57 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు. టీఎంసీపై ఇటీవల తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీలో చేరిన సువేందు అధికారిని నందిగ్రామ్ నుంచి బీజేపీ పోటీలోకి దింపడం విశేషం. నంద్రిగ్రామ్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నందున ఈ నియోజకవర్గంలో పోటీ మరింత రసవత్తరంగా మారింది.