విజయవాడలో వీధిన పడ్డ టిడిపి నేతలు 

మునిసిపల్ ఎన్నికల సందర్భంగా, పార్టీ అధినేత రోడ్ షో జరపడానికి వస్తున్న ముందు రోజున విజయవాడలో టిడిపి నేతలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకొంటూ వీధినపడ్డారు. లోక్ సభ సభ్యుడు కేశినేని నాని కుమార్తె శ్వేతను పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుండి మిగిలిన నేతలు ఖస్సు మంటున్నారు. 
 
అందరూ కావాలా? ఎంపి కేశినేని నాని కావాలో? తేల్చుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చంద్రబాబుకు సవాల్‌ విసరడంతో పరిస్థితులు అదుపుతప్పిన్నట్లు అయింది. పైగా, ఆదివారం చంద్రబాబు నగరంలో జరిపే రోడ్ షో లో కేశినేని నాని పాల్గొంటే తామెవ్వరం పాల్గొనబోమని మిగిలిన నేతలు తేల్చి చెప్పారు.
 
దానితో నష్టనివారణ చర్యలకై స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగారు. టెలికాన్ఫరెన్స్‌లో అందరితో మాట్లాడిన చంద్రబాబు… అసంతృప్త నేతలను సముదాయించినట్టు తెలుస్తోంది. అధినేత ఆదేశాలతో బెజవాడ నేతలతో అచ్చెన్నాయుడు, టి.డి. జనార్దన్‌, వర్ల రామయ్య చర్చించారు. 
 
విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆదివారం చంద్రబాబు పర్యటనలో అందరూ పాల్గొని శ్వేతను గెలిపించేందుకు కృషిచేయాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. 
 
అంతకు ముందు,  పార్టీ కోసం తాము పనిచేస్తున్నామని, కేశినేని మాత్రం పదవుల కోసం పనిచేస్తున్నారని  బోండా ఉమా మండిపడ్డారు. ప్రజారాజ్యంలోనూ ఇదే తరహాలో వ్యవహరించి గెంటించుకున్నారని కేశినేనిపై ఆగ్రహించారు. పార్టీలోనూ కేశినేని వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారని,  గ్రూపులను,కులాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. 
 
నిజంగా కేశినేనికి సత్తా ఉంటే.. రాజీనామా చేసి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ చేశారు. టిడిపి సింబల్‌, చంద్రబాబును చూసే ఓట్లు వేశారని ఎద్దేవా చేశారు. గత కొన్ని రోజులుగా ఎంపీ కేశినేని నానితో విసిగిపోయి మీడియా ముందుకు వచ్చామని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు.
‘‘నీ స్థాయి దాటి వ్యవహరిస్తున్నావు.. దమ్ముంటే రా నువ్వో నేనో తేల్చుకుందాం. రంగా హత్య కేసులో ముద్దాయిని ఎన్నికల ప్రచారంలో తిప్పుతున్నాడు. టీడీపీకి బీసీలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 
 సొంత పార్టీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా చేస్తున్న ఆరోపణలపై  స్పందిస్తూ చంద్రబాబు ఆదేశించిన మరుక్షణం తాను రాజీనామాకు సిద్ధమని కేశినేని నాని ప్రకటించారు.పార్టీ కోసమే తాను కష్టపడుతున్నానని ఆయన చెప్పారు. విజయవాడ కార్పొరేషన్‌పై తెలుగుదేశం జెండా ఎగరాలన్నదే తన ధ్యేయమని పేర్కొంటూ  పార్టీ ఏది చెప్తే అది చేయటానికి తాను సిద్ధమని తెలిపారు.  తన దారిలో తాను వెళ్తుంటే తనకు తెలియని బాధలు కొందరికి ఉన్నాయేమోనని, ఆ విషయం తనకు తెలియదని చెప్పారు.