జిఎస్‌టిలోకి తెస్తే రూ.75కే లీటరు పెట్రోలు

చమురు ఉత్పత్తులను వస్తు సేవలపన్ను(జిఎస్‌టి) పరిధిలోకి తీసుకువస్తే దేశంలో లీటరు పెట్రోలు ధర రూ.75కు దిగి వస్తుందని ఎస్‌బిఐ ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అయితే ఇందుకు రాజకీయవేత్తలు సిద్ధంగా లేరని, అందువల్లే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయని భావిస్తున్నారు. 

‘పెట్రోలు, బీజిలుపై విధించే వ్యాట్, పన్నులు కేంద్రానికి ప్రధాన ఆదాయ వనరులు. అందువల్లే చమురు ధరలను జిఎస్‌టి పరిధిలోకి తేవడానికి కేంద్రం, రాష్ట్రాలు సుముఖంగా లేవు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిలుపై రవాణా చార్జీలు, డీలరు కమిషన్, ఎక్సైజ్ సుంకం, సెస్, వ్యాట్ ఇలా పలు రకాల పన్నులు, చార్జీలు వసూలు చేస్తున్నాయి’ అని పేర్కొన్నారు.

లీటరు పెట్రోలుపై రవాణా చార్జీలు రూ.3.82,డీలరు కమిషన్ రూ.3.67,సెస్ రూ.30గా ఉంది. ఇక డీజిలుపై రవాణా చార్జీలు రూ.7.25, డీలరు కమిషన్ రూ.2.53, సెస్ రూ.20గా ఉంది. ఒక వేళ వీటిని జిఎస్‌టి పరిధిలోకి తీసుకు వస్తే గరిష్ఠంగా 28 శాతం పన్ను ఉంటుంది. 

చమురు ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తెస్తే రాష్ట్రాలకు నష్టం తప్పదు. అయితే అలా తెస్తే మాత్రం వినియోగదారులకు లీటరుపై రూ.30 వరకు భారం తగ్గుతుంది. అప్పుడు పెట్రోలు లీటరు రూ.75కు, డీజిలు రూ.68 కే లభిస్తుందని ఎస్‌బిఐ ఆర్థికవేత్తలు వివరించారు.

ఇంధన ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తెస్తే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు రూ. లక్ష కోట్లు నష్టం వస్తుందని, దేశ జిడిపిలో 0.4 శాతం మాత్రమేనని వారంటున్నారు. అంతేకాక అంతర్జాతీయ ధరలకు అననుగుణంగా దేశంలో ఇంధన ధరలను రోజువారీ మార్పులు చేయకుండా స్థిరీకరించాలని ఆర్థికవేత్తలు సూచించారు. 

అంటే అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు వచ్చే లాభాలతో పెరిగినప్పుడు వచ్చే నష్టాన్ని పూడ్చుకోవాలని సూచించారు. అలా చేస్తే వినియోగదారులపై ఎలాంటి భారం పడదని వారు అభిప్రాయపడ్డారు.