ఆర్ఎస్ఎస్‌ గురించి రాహుల్‌‌కు ఏం తెలుసు?

దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నాశనం చేస్తున్నాట్లు ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొనడంపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ విరుచుకు పడ్డారు.  రాహుల్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఆర్ఎస్ఎస్ గురించి ఆయనకేమీ తెలియదని  జవదేకర్ విమర్శించారు.

‘ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వరంగ సంస్థలు బలహీనం కాలేదని రాహుల్ గాంధీ అంటున్నారు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఆ సమయంలో ప్రభుత్వం అన్ని సంస్థలను, వ్యవస్థలను అణచివేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. దాదాపుగా అన్ని పార్టీలను నిషేధించారు. వార్తాపత్రికలనూ మూసేశారు’ అని పేర్కొన్నారు. 

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను జీర్ణం చేసుకోడానికి రాహుల్ గాంధీకి సమయం పడుతుందని ఎద్దేవా చేశారు. ఆరెస్సెస్ ప్రపంచంలోనే అతి పెద్ద సంఘటనాత్మక సంస్థ అని పేర్కొన్నారు. మానవత్వాన్ని, సామాజిక స్ఫూర్తిని, బాధ్యతను, నైతిక విలువలను సంఘ్ నేర్పిస్తుందని, సంఘ్‌ను అర్థం చేసుకోడానికి రాహుల్‌కు సమయం పడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. 

ఎమర్జెన్సీ విధించడం తప్పేనంటూ రాహుల్ అంగీకరించారని, ఆ సమయంలో ఎమర్జెన్సీ పేరిట ఎన్నెన్ని అప్రజాస్వామిక కార్యక్రమాలు చేసిందో అందరికీ తెలుసని ఆయన చురకలంటించారు. ఏ సంస్థనూ విడిచిపెట్టలేదని, ఏ వ్యక్తినీ విడిచిపెట్టక, అందర్నీ జైళ్లో కుక్కేశారని ఆయన ధ్వజమెత్తారు.

ఎమర్జెన్సీ సమయంలో ఏ వ్యవస్థలూ బలహీనపడలేదని రాహుల్ వ్యా్ఖ్యానించడం హాస్యాస్పదమని కొట్టిపారవేసారు. ఆ  సమయంలో ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించిందని, ప్రజా ప్రతినిధులను జైళ్లో కుక్కేశారని, అన్ని రాజకీయ పక్షాలపైనా నిషేధం విధించారని, ఆ సమయంలో కాంగ్రెస్ చేయని పనంటూ లేదని జవదేకర్ విరుచుకుపడ్డారు. 

దేశంలో ఎమర్జెన్సీ విధించడం తప్పేనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని నానమ్మ ఇందిర కూడా అంగీకరించారని తెలిపారు.