కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ 81 శాతం సమర్ధవంతం 

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ కరోనాను నివారించడంలో 81 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని నిర్ధారణైంది. ఇది బ్రిటన్‌ వేరియంట్‌పై కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని మూడవ దశ క్లినికల్‌ పరీక్షల ‘తొలి మధ్యంతర విశ్లేషణ’లో వెల్లడైనట్లు భారత్‌ బయోటెక్‌ తెలిపింది. 

ఈ మధ్యంతర విశ్లేషణ కోసం 43 కేసులు పరిశీలించి, తద్వారా దీనికి 81 శాతం ప్రభావశీలత ఉన్నట్లు నిర్థారణకు వచ్చినట్లు పేర్కొంది. ఇందులో తీవ్ర స్థాయిలో, వైద్య పరంగా ప్రతికూల సంఘటనలు చోటుచేసుకున్నవి చాలా తక్కువని విశ్లేషణలో తేలినట్లు సంస్థ వెల్లడించింది. తదుపరి మధ్యంతర విశ్లేషణలో 87 కేసులు, తుది విశ్లేషణలో 130 కేసులపౖౖె ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొంది.

రెండు మోతాదులు ఇచ్చిన తర్వాత ముందస్తు ఇన్ఫెక్షన్‌ లేనివారిలో కోవిడ్‌ నివారించడంలో కొవాగ్జిన్‌ 81 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించిందని తెలిపింది. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) భాగస్వామ్యంతో మనదేశంలో నిర్వహించిన అతిపెద్ద క్లినికల్‌ పరీక్ష ఇదని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. 

దేశవ్యాపంగా 25 కేంద్రాల్లో నిర్వహించిన కొవాగ్జిన్‌ టీకా మూడో దశ క్లినికల్‌ పరీక్షల్లో 18-98 ఏళ్ల వయస్సుల లోపు వారు 25,800 మంది పాల్గన్నారు. ఇందులో 60 ఏళ్లు పైబడిన 2,433 మంది, ఇప్పటికే అనారోగ్య కారణాలతో బాధపడుతున్న 4,533 మంది ఉన్నారు. మూడో దశ క్లినికల్‌ పరీక్షల మొదటి మధ్యంతర విశ్లేషణ కోసం 43 కేసులు పరిశీలించారు. తద్వారా దీనికి 81 శాతం ప్రభావశీలత ఉన్నట్లు నిర్థారణకు వచ్చారు. 

ఈ విషయంపై ఢిల్లీ ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా మాట్లాడుతూ  ఈ విశ్లేషణ ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని తెలిపారు. టీకా డ్రైవ్‌లు కొనసాగించేందుకు, టీకాపై వస్తున్న అనుమానాలు దీని ద్వారా పటాపంచలు అయ్యాయని వెల్లడించారు. 

 కాగా, ఫ్రాన్స్‌ కొవాగ్జిన్‌ టీకాల కొనుగోలుపై దృష్టి సారించినట్టు మనీ కంట్రోల్‌ వార్తాసంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. మరోవైపు కొవాగ్జిన్‌ టీకాల కొనుగోలు నిమిత్తం భారతదేశంలో ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్‌ లెనైన్‌ భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లాను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి మాట్లాడినట్టు తెలుస్తున్నది. 

40కి పైగా దేశాలు తమ వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపుతున్నాయని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. టీకాలను తయారుచేసిన తర్వాత నిర్వహించే ట్రయల్స్‌లో వాటి సామర్థ్యం (ఎఫికసీ) ఎంత అనే విషయంపైనే శాస్త్రజ్ఞులు దృష్టి సారిస్తారు.