ఏప్రిల్ 9న షర్మిల పార్టీ పేరు ప్రకటన!

ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిపే భారీ బహిరంగ సభలో తాను తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసే  పార్టీ పేరును ప్రకటించేందుకు మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు లక్షమందిని సమీకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ విషయమై ఆమె ఇప్పటికే ఖమ్మం జిల్లా నేతలతో సమాలోచనలు జరిపినట్లు తెలుస్తున్నది. 

కొత్త పార్టీకి  ‘వైఎస్సార్‌టీపీ’.. ‘వైఎస్సార్‌ పీటీ’.. రాజన్నరాజ్యం అనే పేర్లను ఆమె  పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.  మే 14 నుంచి లోటస్ పాండ్ వేదికగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. మొద‌ట జులై 8న పార్టీని ప్రారంభిస్తార‌ని అనుకున్నా ప్రస్తుతం ఎండ‌ల కార‌ణంగా తేదీల మార్పువిష‌యంలో ష‌ర్మిల అనుచ‌రుల‌తో సుదీర్ఘంగా చ‌ర్చిస్తున్నారు.

ఏప్రిల్ 9న ఖ‌మ్మంలో చివ‌రి ఆత్మీయ స‌మ్మేళ‌నం నిర్వ‌హిస్తుండ‌గా…అదే రోజు పార్టీ పేరును సైతం ఖ‌మ్మం స‌భ వేదిక‌గానే ప్ర‌క‌టించేందుకు రంగంసిద్ధం చేసుకుంటున్నారు. మే 14 రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్యత‌లు తీసుకున్న తేదీని పార్టీ ఏర్పాటుకు వాడుకోవాల‌నుకున్నా….ఎండ‌ల కారణంగా…. స‌భ పెట్ట‌లేమ‌ని… ఆ రోజే పార్టీ వ్య‌వ‌హారాల‌ను లోట‌స్‌పాండ్ నుంచే ప్రారంభిస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో ష‌ర్మిల ఉన్నారు.

ఇప్పటికే ఒకొక్క జిల్లా నుండి అభిమానులతో ఆమె సమాలోచనలు జరుపుతున్నారు. తాను తెలంగాణ కొడాలినని చెప్పుకొంటూ పార్టీ పెట్టుకొనే హక్కు గురించి కూడా ఆమె ప్రస్తావిస్తున్నారు. ఆ మాటకు వస్తే కేసీఆర్ కూడా తెలంగాణ బిడ్డకాదని చెబుతున్నారు.

కాగా, తాను కొత్త పార్టీ ఏర్పాటుపై తన సోదరుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డితో బేధాభిప్రాయాలు ఉన్నమాట నిజమే అను, వ్యక్తిగతంగా తామిద్దరి మధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేవని పేర్కొనడం గమనార్హం. కొత్త పార్టీ ఏర్పాటుకు తనకు తల్లి వై ఎస్ విజయమ్మ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు కూడా ఆమె ప్రకటించారు.