పెట్టుబడుల ఉపసంహరణపై బిఎంఎస్ ఉద్యమం 

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం కావించాలని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా దశల వారీగా రాబోయే ఎనిమిది నెలల్లో ఉద్యమాలు చేపట్టాలని దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ నిర్ణయించింది. 
 
హైదరాబాద్ లో రెండు రోజులపాటు జరిగిన బిఎంఎస్ ప్రభుత్వ రంగ సంస్థల సమానవ్యయ కమిటీ సమావేశాలలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమల వారీగా ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష జరిపి, కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రైవేట్ వారికి అమ్మడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. 
 
వ్యూహాత్మక, వ్యూహరహిత సంస్థల పేరిట సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (సిపిఎస్ఇ) యొక్క పెట్టుబడుల ఉప సంహరణ ప్రతిపాదనతో పాటు సిపిఎస్ఇల ఆస్తులను నిధుల కోసం అమ్మే ప్రయత్నాల పట్ల కూడా నిరసన వ్యక్తం చేశారు. 
మార్చి 15 నుండి నవంబర్ 23 వర్కౌ ఎనిమిది నెలల సుదీర్ఘ ఆందోళన జరపడం కోసం బిఎంఎస్ ప్రణాళిక రూపొందించింది.  ఈ సందర్భంగా సిపిఎస్ఇల కార్పొరేట్ కార్యాలయాల ముందే కాకుండా రాష్ట్రాలలోని అన్ని బిఎంఎస్ విభాగాలు నిరసన ప్రదర్శలను జరుపుతామని తెలిపారు. 

కేంద్ర బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించిన “దూకుడు పెట్టుబడుల ఉపసంహరణ  కార్యక్రమాలను” రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు,   సాధారణ భీమా సంస్థలను విక్రయించడం, పెట్టుబడుల ఉపసంహరణ కోసం కొత్త కంపెనీల  జాబితా చేయమని నితి ఆయోగ్‌ను కోరడం వంటి కేంద్ర ప్రభుత్వ చర్యల పట్ల బిఎంఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.