జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్‌ స్వాధీనం

జమ్మూ కాశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో శుక్రవారం భద్రతా బలగాలు భారీ డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎగువ సిల్ధార్, రంజాటి, రౌసవాలిలో అనుమానాస్పద కదలికలపై పక్కా సమాచారం అందడంతో పోలీసులు, ఆర్మీ బలగాలు, సీఆర్‌పీఎఫ్‌ దలాలు ఎగువ సిల్ధార్‌ అటవీ ప్రాంతం, రంజాటి ప్రాంతంలో కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి.
డాగాంటాప్ హిల్స్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా భూగర్భ స్థావరాన్ని గుర్తించారు. ఇందులో రెండు మ్యాగజైన్స్‌, 150 రౌండ్లతో కూడిన ఏకే 47, రాకెట్ లాంఛర్, 16 యుబీజీఎల్‌ గ్రెనేడ్లు, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లతో పాటు భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని, రేడియో సెట్లను రహస్య స్థావరం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
డంప్‌ను సకాలంలో గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయిందని అధికారులు పేర్కొన్నారు. లేకపోతే శాంతియుత వాతావరణానికి విఘాతం కల్పించేలా అవాంఛనీయ సంఘటనలు జరిగి ఉండేవని ఆందోళన వ్యక్తం చేశారు.
పిర్‌ పంజల్‌ శ్రేణుల్లోని దక్షిణ ప్రాంతంలో శాంతి, సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు చేసిన కుట్రలను అడ్డుకున్నట్లు సదరు అధికారి తెలిపారు. ఘటనపై మహోర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.