ట్రాక్టర్లు కొనకపోతే సర్పంచుల చెక్ పవర్ కట్

యంత్రలక్ష్మి పథకం ద్వారా ఇచ్చే ట్రాక్టర్లు తన షో రూంలో కొనకపోతే సర్పంచుల చెక్ పవర్ కట్ చేసిన నీచ సంస్కృతి పోచారం కుటుంబానిద‌ని నిజామాబాద్ ఎంపీ, బిజెపి ఎంపీ డి. అర్వింద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని తీవ్రంగా విమ‌ర్శించారు,
 
బాన్సువాడ‌లో పోచారం కొడుకుల అవినీతి మితిమీరిందని.. ఇసుక అక్రమ రవాణాతో అక్క‌డి ప్ర‌జ‌ల‌ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాన్సువాడలో జరిగిన బిజెపి బహిరంగ సభలో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. ఆ అక్రమ ఇసుక వ్యాపారంలో కేసీఆర్ కుటుంబానికి కూడా వాటాలున్నాయని ఆరోపించారు. బాన్సువాడ ప్రజలు ఇకనైనా కళ్ళు తెరవాలని అరవింద్ కోరారు. 
 
శి లావస్థకు చేరుకున్న మందిరాల్లో ఉన్న గబ్బిలాల లాగా .. పోచారం కుటుంబం బాన్సువాడలో ఏళ్లుగా పాతుకుపోయిందని ఆయ‌న‌ ధ్వజమెత్తారు. బాన్సువాడ వెనుకబడ్డ ప్రాంతం కాదని , అభివృద్ధి నిర్లక్ష్యం చేయబడ్డ ప్రాంతమని అరవింద్ విమర్శించారు. బండి సంజయ్ నాయకత్వంలో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమని అరవింద్ భరోసా వ్యక్తం చేశారు.  2022లో బాన్సువాడ ప్రజలకు పోచారం గ్రహణం వీడనుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, రామరాజ్యం రావాలంటే అది బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత మల్యాద్రిరెడ్డి, అతని అనుచరులు బీజేపీలో చేరారు. ప్రతీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ చెప్పిందే చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని సంజయ్ విమర్శించారు. ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న కొంతమంది బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో బాన్సువాడలో టీఆర్‌ఎస్‌ బాక్సులు బద్దలవడం ఖాయమని, కాశాయ జెండా ఎగురవేస్తామని సంజయ్ భరోసా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు కంచు కోటగా ఉన్న బాన్సు వాడలో బీజేపీ గురువారం జరిగిన బహిరంగ సభతో తన సత్తాను నిరూపించుకుంది.