సేంద్రియ వ్యవసాయంతో రుణఉచ్చు నుంచి విముక్తి 

సేంద్రియ వ్యవసాయం రైతులను రుణఉచ్చు నుంచి తప్పిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్ విశ్వాసం వ్యక్తం చేశాన్నారు. అంతేకాకుండా వారిని స్వావలంబన వైపు తీసుకెళ్తుందని పేర్కొన్నారు.

మోహన్ భాగవత్ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో ఏకలవ్య ఫౌండేషన్ నిర్వహించిన సేంద్రీయ వ్యవసాయ కార్యక్రమంలో పాల్గొంటూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రశంసించారు. కొందరు సేంద్రియ వ్యవసాయాన్ని వ్యతిరేకిస్తున్నారని, అలాంటి వారు వారి గర్వాన్ని పక్కన పెట్టి, సేంద్రియ రైతులు సాధిస్తున్న విజయాలను ఓసారి చూడాలని పిలుపునిచ్చారు. 

ఆధునిక వ్యవసాయంతో పోలిస్తే సేంద్రియ వ్యవసాయానికి ఖర్చు తక్కువగా ఉంటుందని, అధిక ధరతో కూడిన ఎరువులను కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఆధునిక వ్యవసాయం ద్వారా పండించే పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చినా కొంత మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పారు.

‘‘సేంద్రియ వ్యవసాయం రైతులను రుణాల ఉచ్చు నుంచి బయటికి లాగేస్తుంది. వారిని సర్వ స్వతంత్రులను చేస్తుంది. నిజమైన స్వాతంత్య్రాన్ని రైతులు అనుభవించేలా చేస్తుంది. వీటితో పాటు సొంతంగా విత్తనాలను తయారుచేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ఏది కావాలనుకుంటే అది సేంద్రీయ వ్యవసాయం అందిస్తుంది.’’ అని మోహన్ భాగవత్ వివరించారు.

అంతేకాకుండా సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించేవారు విత్తనాల కోసం ఆయా కంపెనీలకు బానిసలుగా ఉండరని, నేల నాణ్యత కూడా భారీగా పెరుగుతుందని తెలిపారు. పంటలను పండించే క్రమంలో అనేక రకాల ఎరువులను వాడటం ద్వారా నేల పాడవడంతో పాటు రైతులు కేన్సర్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంబించడమంటే కేవలం ఎరువులను వాడకపోవడం మాత్రమే కాదని, పూర్వీకుల విధానాన్ని కొనసాగించడమని మోహన్ భాగవత్ తెలిపారు.